‘పాము’ బంధువు లాకర్లలో బంగారం గుట్టలు
- 1,400 గ్రాముల ఆభరణాలు స్వాధీనం
- నేడు మరో లాకర్లు తెరవనున్న అధికారులు
జంగారెడ్డిగూడెం (పశ్చిమగోదావరి): ఏపీ మున్సిపల్ శాఖ ప్రజారోగ్య విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ పాము పాండురంగారావు సమీప బంధువుకు చెందిన బ్యాంకు లాకర్‌ను తెరవగా 1,400 గ్రాముల బంగారం ఆభరణాలు లభించాయి. ఏసీబీ సీఐ సతీష్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఏసీబీ డీఎస్పీ రమాదేవి ఆదేశాల మేరకు పాండురంగారావు బంధువుల లాకర్లపై దృష్టి సారించామన్నారు.
ఈ నేపథ్యంలో పాండురంగారావుకు సమీప బంధువు, చిన్నపిల్లల వైద్యుడైన కృష్ణమూర్తి భార్య ఎన్.రాజ్యలక్ష్మి పేరున పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో (డీసీసీబీ) లాకర్ ఉన్నట్లు గుర్తించామన్నారు. మంగళవారం లాకర్‌ను తెరిచి చూడగా 1,400 గ్రాముల బంగారం ఆభరణాలు లభించాయని, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బుధవారం మరో బ్యాంకు లాకర్‌ను తెరవాల్సి ఉందన్నారు. ఈ నెల 23న కృష్ణమూర్తి ఇళ్లు, ఆస్పత్రిపై ఏసీబీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో రూ. 2 కోట్ల విలువైన 22 డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.