'లోక్సభ సస్పెన్షన్ల'పై రాజ్యసభలో రచ్చ
న్యూఢిల్లీ: లోక్సభలో 25 మంది కాంగ్రెస్ సభ్యుల సస్పన్షన్ అంశం రాజ్యసభనూ కుదిపేస్తోంది. శుక్రవారం ఉదయం రాజ్యసభ ప్రారంభమైన వెంటనే ప్రభుత్వం తీరుపై నిరసన తెలుపుతూ విపక్ష సభ్యులు.. పోడియాన్ని చుట్టుముట్టారు. ఉపాధ్యక్షుడు పీజే కురియన్ ఎంతగా వారించినప్పటికీ విపక్ష ఎంపీలు వెనక్కి తగ్గలేదు.
అంతలోనే కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ లేచి.. కాంగ్రెస్ సభ్యుల తీరుపై విమర్శలు గుప్పించారు. సభాసాంప్రదాయాలను మంటగలుపుతున్నారంటూ మండిపడ్డారు. దీంతో విపక్ష సభ్యులు హెచ్చు స్వరంతో మరింత రచ్చ చేశారు. గందరగోళం మధ్యే ఉపాధ్యక్షుడు సభను అరగంటపాటు (12 గంటల వరకు) వాయిదావేయాల్సి వచ్చింది.
ఉపరాష్ట్ర పతి హమీద్ అన్సారీ చైర్మన్ స్థానంలో ఆసీనులు కాగా 12 గంటకు సభ తిరిగి ప్రారంభమైంది. అప్పుడు కూడా విపక్ష సభ్యులు నిరసనలను కొనసాగించారు. దీంతో చైర్మన్ సభను మద్యాహ్నం 2:30 గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు 30 మంది బీజేపీ సభ్యులపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. కాగా, శుక్రవారం నాటి సమావేశాలకు సభ్యులందరూ హాజరుకావాల్సిందేనని అధికార, విపక్ష పార్లీలన్నీ విప్ లు జారీచేయడంతో రాజ్యసభ నిండుకుండలా కనబడింది.