అన్నాడీఎంకే ఎంపీలందరూ సభకు గైర్హాజరు!
న్యూఢిల్లీ : తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో అన్నాడీఎంకే ఎంపీలందరూ నేటి లోక్సభ సమావేశాలకు గైర్హాజరు అయ్యారు. అన్నాడీఎంకేకు చెందిన మొత్తం 37 మంది లోక్సభ ఎంపీలు నేడు జరుగుతున్న సమావేశాలకు గైర్హాజరు అయి, హుటాహుటిన చెన్నైకు ప్రయాణమయ్యారు. దీంతో సభలో అన్నాడీఎంకే సభ్యుల బెంచీలను ఖాళీగా, నిర్జీవంగా మారాయి. అదేవిధంగా అన్నాడీఎంకే పార్టీకి చెందిన, లోక్సభకు డిప్యూటీ స్పీకర్గా ఉన్న మునిసామి తంబిదురై కూడా నేటి సమావేశాలకు గైర్హాజరు అయ్యారు.
కాగ, ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో అమ్మ జయలలితకు కార్డియాక్ అరెస్ట్(గుండె పనిచేయడం కొద్దిసేపు ఆగిపోవడం) రావడంతో, ఆమె పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆమెకు అత్యుత్తమ వైద్య సహాయం అందిస్తున్నట్టు అపోలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంగీతారెడ్డి ట్వీట్ చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలోనూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.