
తన్నుకున్న బాబాయ్, అబ్బాయ్ ల కార్యకర్తలు
లక్నో: సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) సోమవారం నిర్వహించనున్న సమావేశానికి ముందు శివపాల్ సింగ్ యాదవ్, ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తనయుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ల సపోర్టర్ల మధ్య కొట్లాట జరిగింది. ఒకరినిమించి ఒకరు నినాదాలు చేసిన ఇరువర్గాలు కొట్లాటకు దిగాయి. దీంతో భద్రతా దళాలు, పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి పరిస్ధితిని అదుపులోకి తీసుకువచ్చారు.
ఆదివారం మంత్రి పదవి నుంచి శివపాల్ యాదవ్(అఖిలేశ్ యాదవ్ కు బాబాయ్ అవుతారు)ను ముఖ్యమంత్రి అఖిలేశ్ రెండో సారి తొలగించారు. దీంతో తమ్ముడు శివపాల్ యాదవ్ కు మద్దతు పలుకుతున్న తన తండ్రి, పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కు అఖిలేశ్ చాలెంజ్ విసిరినట్లయింది. అఖిలేశ్ చర్యకు బదులుగా అతనికి అత్యంత సన్నిహితుడైన రామ్ గోపాల్ యాదవ్ ను ములాయం పార్టీ నుంచి బహిష్కరించారు. రామ్ గోపాల్ బీజేపీతో చేతులు కలపడమే ఇందుకు కారణమని శివపాల్ యాదవ్ పేర్కొన్నారు.
వచ్చే నెల 5వ తేదీతో సమాజ్ వాదీ పార్టీని స్ధాపించి 25 ఏళ్లు పూర్తవుతుండటంతో సంబరాలపై చర్చించేందుకే సమావేశాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు ములాయం తెలిపారు. పార్టీ అధ్యక్షుడు ఏర్పాటు చేసిన సమావేశానికి తాను హాజరౌతానని ముఖ్యమంత్రి అఖిలేశ్ కూడా ప్రకటించారు. దీంతో శివపాల్, అఖిలేశ్ ల మధ్య వివాదాలు సమసిపోయేలా ములాయం ఏదైనా చేస్తారనే సమాచారం ఉంది.
గత ఏడాది జరిగిన బీహార్ ఎన్నికల్లో మహాకూటమి నుంచి బయటకు రావడానికి కారణం రామ్ గోపాలేనని శివపాల్ ఆరోపించారు. కానీ ఇది ములాయం చేసిన తప్పుగా అందరూ చూశారని అన్నారు. శివపాల్ తాజా ఆరోపణలతో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎస్పీ మరో పార్టీతో జతకట్టే ఆలోచనలో ఉందనే ప్రచారం జరుగుతోంది. పార్టీలో చీలికపై మాట్లాడిన ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్.. తనకు పార్టీ నుంచి బయటకు వెళ్లే ఉద్దేశం లేదని చెప్పారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాలో ములాయం, శివపాల్ లు సూచించిన పేర్లను అఖిలేశ్ పక్కనబెట్టడంతో పార్టీలో ముసలం ప్రారంభమైన విషయం తెలిసిందే.