మణి-చరణ్: మెగా కాంబినేషన్ సెట్టయిందా!?
తమిళ సినిమా: ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తన కొత్త సినిమా కోసం సిద్ధం అవుతున్నారు.. కాట్రువెలియిడై (చెలియా) చిత్రం తర్వాత మణి తదుపరి చిత్రపనుల్లో మునిగిపోయారని తాజా సమాచారం. ఈ సారి భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారట. టాలీవుడ్ మెగా వారసుడు రాంచరణ్, మాలీవుడ్ నటుడు ఫాహద్ పాజిల్‌ల కాంబినేషన్‌లో ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో రూపొందించనున్నట్టు తెలుస్తోంది.
రామ్‌చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' అనే చిత్రంలో నటిస్తున్నారు. దీని తరువాత మణిరత్నం దర్శకత్వంలో ఆయన నటించనున్నట్లు కోలివుడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో ఇద్దరు కథానాయికలు ఉంటారని, అందులో ఒకరిగా 'చెలియా' ఫేమ్ అదితిరావు నటించనున్నారని తెలుస్తోంది. మరో కథానాయకి ఎంపిక జరుగుతున్నట్లు సమాచారం. మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి బాణీలు సమకూర్చనున్నారు. సంతోష్‌శివన్ చాయాగ్రహణం అందించనున్నట్టు తెలుస్తోంది. ఇంతకుముందు మణిరత్నం చిత్రాలు దళపతి, రోజా, ఇద్దరు, రావణన్ తదితర చిత్రాలకు సంతోష్‌శివన్ చాయాగ్రహణం అందించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెప్టెంబర్‌లో సెట్ పైకి వెళ్లే అవకాశముందని కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి.