ప్రియురాలి కోసం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి!
విదేశాలకు వెళుతున్న ప్రియురాలిని చూసేందుకు నకిలీ టికెట్‌తో ఎయిర్‌పోర్టుకు వెళ్లిన ఓ ప్రయాణికుడు అడ్డంగా బుక్కయ్యాడు. స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో భద్రతా సిబ్బంది హైఅలర్ట్‌గా ఉండటంతో అతని ఆగడానికి అడ్డుకట్ట పడింది. ఈ మేరకు దుందుడుకు చర్యకు పాల్పడిన ఇటలీ దేశస్తుడు అరెస్టయ్యాడు. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఈ ఘటన జరిగింది.
ఆగస్టు 15న నకిలీ టికెట్‌తో విమానాశ్రయంలోకి ప్రవేశించిన నిందితుడు అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో ఎయిర్‌పోర్టులో పహారా కాసే సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుంది. అయితే, తాను ప్రయాణికుడిని కాదని అతను విచారణలో స్పష్టం చేశాడు. ఆగస్టు 16న అతడు మాస్కోకు వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం కన్ఫర్మ్ అయిన టికెట్ అతని దగ్గర ఉంది. ఈ టికెట్‌ను ఫొటో ఎడిట్ సాఫ్ట్‌వేర్‌తో మార్పులు చేసి ఆగస్టు 16, 15గా మార్చాడు. ఆ టికెట్‌తో అతను ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించాడని, ఆ తర్వాత నకిలీ టికెట్‌ను చింపివేశాడని విచారణలో తేలింది. కాగా, తన ప్రియురాలు చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్ విమానంలో ఆగస్టు 15న ప్రయాణిస్తుండటంతో ఆమెను చూసేందుకు తాను దుండగానికి పాల్పడ్డట్టు నిందితుడు చెప్పాడు. దీంతో అతన్ని అరెస్టుచేసి పోలీసు స్టేషన్‌కు పంపించారు. గత 14 నెలల్లో దాదాపు 30మంది నకిలీ ఈ-టికెట్లతో విమానాశ్రయంలోకి ప్రవేశించి అరెస్టయ్యారు.