fake ticket
-
ప్రియురాలి కోసం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి!
విదేశాలకు వెళుతున్న ప్రియురాలిని చూసేందుకు నకిలీ టికెట్‌తో ఎయిర్‌పోర్టుకు వెళ్లిన ఓ ప్రయాణికుడు అడ్డంగా బుక్కయ్యాడు. స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో భద్రతా సిబ్బంది హైఅలర్ట్‌గా ఉండటంతో అతని ఆగడానికి అడ్డుకట్ట పడింది. ఈ మేరకు దుందుడుకు చర్యకు పాల్పడిన ఇటలీ దేశస్తుడు అరెస్టయ్యాడు. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఈ ఘటన జరిగింది. ఆగస్టు 15న నకిలీ టికెట్‌తో విమానాశ్రయంలోకి ప్రవేశించిన నిందితుడు అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో ఎయిర్‌పోర్టులో పహారా కాసే సీఐఎస్ఎఫ్ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుంది. అయితే, తాను ప్రయాణికుడిని కాదని అతను విచారణలో స్పష్టం చేశాడు. ఆగస్టు 16న అతడు మాస్కోకు వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం కన్ఫర్మ్ అయిన టికెట్ అతని దగ్గర ఉంది. ఈ టికెట్‌ను ఫొటో ఎడిట్ సాఫ్ట్‌వేర్‌తో మార్పులు చేసి ఆగస్టు 16, 15గా మార్చాడు. ఆ టికెట్‌తో అతను ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించాడని, ఆ తర్వాత నకిలీ టికెట్‌ను చింపివేశాడని విచారణలో తేలింది. కాగా, తన ప్రియురాలు చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్ విమానంలో ఆగస్టు 15న ప్రయాణిస్తుండటంతో ఆమెను చూసేందుకు తాను దుండగానికి పాల్పడ్డట్టు నిందితుడు చెప్పాడు. దీంతో అతన్ని అరెస్టుచేసి పోలీసు స్టేషన్‌కు పంపించారు. గత 14 నెలల్లో దాదాపు 30మంది నకిలీ ఈ-టికెట్లతో విమానాశ్రయంలోకి ప్రవేశించి అరెస్టయ్యారు. -
10 రోజులు ఎయిర్ పోర్టులో నక్కాడు!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఐజీఐ విమానాశ్రయంలో భద్రతా లోపాలు బయటపడుతున్నాయి. నకిలీ టిక్కెట్లతో ఎయిర్ పోర్టులోకి చొరబడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రిపబ్లిక్ డేకు వారం రోజుల ముందు జరిగిన ఘటన భద్రతా వైఫల్యానికి అద్దం పడుతోంది. నకిలీ టికెట్ తో ఎయిర్ పోర్టులోకి చొరబడిన ఓ వ్యక్తి ఏకంగా 10 రోజుల పాటు అక్కడ తిష్ట వేశాడు. అతడిని హౌస్ కీపింగ్ ఉద్యోగి గుర్తించి సీఐఎస్ఎఫ్ కు సమాచారం అందించడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. జనవరి 20న అతడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడు హైదరాబాద్ కు చెందిన మహ్మద్ అబ్దుల్లాగా గుర్తించారు. ఇండియా ఎయిర్ పోర్టులో ఒక వ్యక్తి ఇన్నిరోజులు తిష్ట వేయడం ఇదే మొదటిసారని సీఐఎస్ఎఫ్ అధికారి వెల్లడించారు. జనవరి 11న అబ్దుల్లా.. ఢిల్లీ విమాశ్రయానికి వచ్చాడు. అతడి టికెట్ నకిలీదని గుర్తించి అనుమతి నిరాకరించారు. అయితే అతడు మరో గేటు గుండా ఎయిర్ పోర్టులోకి ప్రవేశించాడు. ఎవరికీ అనుమానం రాకుండా 10 రోజుల పాటు అక్కడ గడిపాడు. దుబాయ్ వెళ్లేందుకు రావల్సిన డబ్బు అందుకునేందుకే ఎయిర్ పోర్టులో వేచివున్నానని పోలీసుల విచారణలో అతడు చెప్పాడు. ఢిల్లీ ఐజీఐ విమానాశ్రయంలో నకిలీ టికెట్లతో 2015లో 50 మందిపైగా పట్టుబడ్డారు. ఈ ఏడాది ఇప్పటివరకు 20 కేసులు నమోదయ్యాయి. మార్చిలో ఓ యువకుడు భద్రతాదళాల కళ్లుగప్పి తుపాకీతో ఎయిర్ పోర్టులోపలికి ప్రవేశించాడు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆరుగురిని గత నెలలో అరెస్ట్ చేశారు. విమానాశ్రయాల్లో భద్రతా వైఫల్యాలపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. -
గర్ల్‌ఫ్రెండ్‌ను చూసేందుకు వచ్చి..
న్యూఢిల్లీ: గర్ల్‌ఫ్రెండ్‌ను చూసేందుకు ఓ విదేశీయుడు అక్రమంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి చొరబడ్డాడు. నిందితుడు ఢిల్లీ-ఫ్రాంక్ఫర్ట్ నకిలీ విమాన టికెట్‌తో టర్మినల్ 3 లోపలికి ప్రవేశించాడు. చివరకు అధికారులు గుర్తించి అతడ్ని అరెస్ట్ చేశారు. గత సోమవారం జరిగిన ఈ సంఘటన విమానాశ్రయంలో భద్రతాలోపాలను ఎత్తిచూపింది. నిందితుడిని మైకేల్ ఎలియాజ్ రోడ్రిగుజ్గా గుర్తించారు. అతడికి స్పెయిన్ పాస్‌పోర్టు ఉన్నట్టు అధికారులు చెప్పారు. ప్రవేశ ద్వారం వద్ద మైకేల్‌ను సీఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని పేరు మీద టికెట్ లేదని నిర్ధారించుకున్న తర్వాత ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. అతడిపై ఫోర్జరీ, చీటింగ్ కేసు నమోదు చేశారు. కాగా తన గర్ల్‌ఫ్రెండ్‌ను చూసేందుకు వచ్చినట్టు అతడు చెప్పాడు. ఢిల్లీ విమానాశ్రయంలోకి భారత ప్రయాణికులతో పాటు విదేశీయులు భారీ సంఖ్యలో వస్తుంటారని, వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని కఠిన నిబంధనలను అమలు చేయాల్సిన అవసరముందని సీఐఎస్ఎఫ్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇలాంటి సంఘటనలు గతంలో చాలా జరిగాయని, అయితే ఇంతవరకు పరిష్కారం కనుగొనలేదని చెప్పారు. కొందరు నకిలీ టికెట్లతో విమానాశ్రయంలోకి వస్తున్నారని, ఇది భద్రతపరంగా ఆందోళన కలిగించే విషయమని పోలీసులు, సీఐఎస్ఎఫ్ అధికారులు చెప్పారు. ఈ సమస్యను అధిగమించేందుకు హైదరాబాద్ విమానాశ్రయంలో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. నకిలీ టికెట్లను గుర్తించేందుకు ప్రవేశ ద్వారాల వద్ద బార్ కోడ్ స్కానర్లు ఏర్పాటు చేయనున్నారు. బ్రసెల్ బాంబు పేలుళ్ల ఘటన అనంతరం ముందుజాగ్రత్తగా విమానాశ్రయాల్లో నిఘాను పెంచారు.