గర్ల్ఫ్రెండ్ను చూసేందుకు వచ్చి..
న్యూఢిల్లీ: గర్ల్ఫ్రెండ్ను చూసేందుకు ఓ విదేశీయుడు అక్రమంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి చొరబడ్డాడు. నిందితుడు ఢిల్లీ-ఫ్రాంక్ఫర్ట్ నకిలీ విమాన టికెట్తో టర్మినల్ 3 లోపలికి ప్రవేశించాడు. చివరకు అధికారులు గుర్తించి అతడ్ని అరెస్ట్ చేశారు. గత సోమవారం జరిగిన ఈ సంఘటన విమానాశ్రయంలో భద్రతాలోపాలను ఎత్తిచూపింది.
నిందితుడిని మైకేల్ ఎలియాజ్ రోడ్రిగుజ్గా గుర్తించారు. అతడికి స్పెయిన్ పాస్పోర్టు ఉన్నట్టు అధికారులు చెప్పారు. ప్రవేశ ద్వారం వద్ద మైకేల్ను సీఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని పేరు మీద టికెట్ లేదని నిర్ధారించుకున్న తర్వాత ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. అతడిపై ఫోర్జరీ, చీటింగ్ కేసు నమోదు చేశారు. కాగా తన గర్ల్ఫ్రెండ్ను చూసేందుకు వచ్చినట్టు అతడు చెప్పాడు. ఢిల్లీ విమానాశ్రయంలోకి భారత ప్రయాణికులతో పాటు విదేశీయులు భారీ సంఖ్యలో వస్తుంటారని, వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని కఠిన నిబంధనలను అమలు చేయాల్సిన అవసరముందని సీఐఎస్ఎఫ్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇలాంటి సంఘటనలు గతంలో చాలా జరిగాయని, అయితే ఇంతవరకు పరిష్కారం కనుగొనలేదని చెప్పారు.
కొందరు నకిలీ టికెట్లతో విమానాశ్రయంలోకి వస్తున్నారని, ఇది భద్రతపరంగా ఆందోళన కలిగించే విషయమని పోలీసులు, సీఐఎస్ఎఫ్ అధికారులు చెప్పారు. ఈ సమస్యను అధిగమించేందుకు హైదరాబాద్ విమానాశ్రయంలో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. నకిలీ టికెట్లను గుర్తించేందుకు ప్రవేశ ద్వారాల వద్ద బార్ కోడ్ స్కానర్లు ఏర్పాటు చేయనున్నారు. బ్రసెల్ బాంబు పేలుళ్ల ఘటన అనంతరం ముందుజాగ్రత్తగా విమానాశ్రయాల్లో నిఘాను పెంచారు.