
అవినీతి రూ.కోటి దాటితేనే ఏసీబీ దాడి!
సాక్షి, కర్నూలు: రైతుల రుణమాఫీకి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ షరతు పెట్టినట్లుగానే అవినీతి అధికారులు ఆదాయానికి మించి కూడబెట్టిన ఆస్తులకూ తెలుగుదేశం ప్రభుత్వం ఓ మార్కు విధించింది. స్పష్టమైన ఫిర్యాదులు అందితే తప్ప దాడులు చేయని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ).. ఆదాయానికి మించిన ఆస్తులపై నిరంతర నిఘా ఊసే మరిచింది. తాజాగా లంచావతారులు కూడబెట్టిన ఆస్తులు, నగదు.. ఇతరత్రా కలిపి కోటి రూపాయలకు పైగా ఉంటేనే దృష్టి సారించాలని, లేకపోతే వదిలేయండని హైదరాబాద్‌లోని ఆ శాఖ పెద్దలు కిందిస్థాయి అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
ఉన్నతాధికారి తీరు వల్ల జీతం కంటే గీతంపై మక్కువ చూపే అధికారుల సంఖ్య పెరిగిపోతుందని ఆ శాఖ వర్గాలే ఆందోళన చెందుతున్నాయి. ‘అక్రమాస్తుల గురించి తెలిసిన వ్యక్తులు మాకు సమాచారం అందించండి.. మీ వివరాలను గోప్యంగా ఉంచుతాం..’ అని ఏసీబీ అధికారులు ప్రచారం చేసేవారు. తాజా ఆదేశాలతో... ఇకపై ‘రూ. కోటి పైగా ఆస్తులు కూడబెట్టిన అవినీతి అధికారుల గురించి తెలిస్తే మాకు సమాచారం ఇవ్వండి..’ అంటూ సరికొత్త నినాదంతో ముందుకెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడిబోతోంది. ఇటీవల రాయలసీమకు చెందిన ఏసీబీ ఉన్నతాధికారికి ఓ అవినీతి అధికారి వెనకేసిన ఆస్తుల వివరాలపై ఆయన బంధువు నుంచి ఫిర్యాదు వచ్చింది.
ఆ ఫిర్యాదుపై ఏసీబీ అధికారులు ఆరా తీయగా సుమారు రూ. 75-80 లక్షల వరకు ఆస్తులు, నగద కూడబెట్టినట్లు తేలింది. ఆ అధికారిపై చర్యలకు ఆదేశాలు ఇవ్వాలని ఉన్నతాధికారిని కోరగా.. ‘ఎంత వెనకేసుకున్నాడు? ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి? మొత్తం విలువ ఎంత? అనే వివరాలు ఆరా తీశాక రూ. 80 లక్షలే కదా.. రూ. కోటికి పైగా ఉంటే చెప్పండయ్యా అప్పుడు ఆలోచిద్దాం అన్నట్లు సమాచారం. ఉన్నతాధికారి నుంచి అలాంటి సమాధానం వస్తుందని ఊహించని ఆ అధికారి సహచరుల వద్ద ఇదేమి పరిస్థితి అని వాపోయినట్లు తెలిసింది.
అధికారుల అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చేది చాలా తక్కువ మందే. ఈ పరిస్థితుల్లో రూ. కోటికన్నా ఎక్కువ అవినీతి పాల్పడినవారి సమాచారమే పరిగణనలోకి తీసుకుంటే ఇక ముందుకు వచ్చేది ఎవరన్నది కోటి డాలర్ల ప్రశ్నగా మిగలనుంది. కోటి రూపాలయకన్నా ఎక్కువ అక్రమ ఆస్తులు కూడాబెట్టిన సమాచారాన్ని ఫిర్యాదుదారే ద్రువీకరించుకుని ఏసీబీకి సమాచారం ఇవ్వాలన్నమాట.
ఆయనదేపార్టీ.. కులమేంటి!
నీటిపారుదల శాఖలో ఓ ఇంజనీరు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన సమాచారం అందుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు జరిపేందుకు సిద్ధమవుతుండగా.. విషయం తెలుసుకున్న ఆ ఇంజనీరు ప్రభుత్వంలో తన పలుకుబడి ఉపయోగించి దాడులు జరగకుండా అడ్డుకున్నట్లు తెలిసింది. పైగా ఈ విషయంలో ఏసీబీ అధికారులకు ఉన్నతాధికారులు చీవా ట్లు కూడా పెట్టినట్లు సమాచారం.
అసలు దాడులు చేసే ముందు ఆ అధికారి ఎవరు? అతని కులం ఏంటి? ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాడనే సమాచారం తెలుసుకోవాలంటూ హెచ్చరించినట్లు సమాచారం. మొత్తం మీద ఏసీబీ ఉన్నతాధికారి చర్యలతో ప్రభుత్వ కార్యాలయాల్లో లంచావతారుల ఇష్టారాజ్యం పెరగుతుందని విచారణాధికారులు భావిస్తున్నారు.