
'త్వరలో ఏపీ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తా'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణగా పేరుంది.... బహుళ పంట భూములను రాజధానికి వినియోగించవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రముఖ సంఘ సేవకుడు అన్నాహజారే విజ్ఞప్తి చేశారు. బుధవారం చంద్రబాబుకు అన్నాహజారే లేఖ రాశారు. ఈ సందర్భంగా ఏపీ రాజధానికి భూ సేకరణపై చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై అన్నాహజారే అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాలు ఆహారభద్రతకు చాలా అవసరమైన ప్రాంతాలని ఆ లేఖలో అన్నాహజారే పేర్కొన్నారు. మా మిషన్ సభ్యులు ఇటీవల రాజధాని ప్రాంతంలో పర్యటించినప్పుడు రైతులు చాలా సమస్యలు చెప్పారని తెలిపారు.
బలవంతంగా తమ పంట భూములు తీసుకుంటున్నారని రైతులు తమ మిషన్ సభ్యుల ఎదుట అవేదన వ్యక్తం చేశారన్నారు. భూములు ఇవ్వకపోతే భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తామని బెదిరించారని రైతులు ఆందోళనతో తమ సభ్యులకు చెప్పారని చంద్రబాబుకు రాసిన లేఖలో అన్నాహాజారే వివరించారు. ఏపీలో వ్యవసాయేతర భూములను ప్రకటించి ఆ భూములు రాజధాని నిర్మాణానికి వినియోగించాలని సూచించారు. త్వరలో రాజధాని ప్రాంతాంలో పర్యటిస్తానని చంద్రబాబుకు రాసిన లేఖలో అన్నాహజారే స్పష్టం చేశారు.