
ఏపీకి 'ప్రపంచ బ్యాంక్' 1వ ర్యాంక్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలోని ఆంధ్రప్రదేశ్ మరో ఘనత సాధించింది. ప్రపంచ బ్యాంకు ప్రకటించిన తాజా ర్యాంకుల్లో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇంధన పొదుపు అమలులో బాబు సర్కార్ అవలంభిస్తున్న చర్యలకుగానూ ఈ ర్యాంకు లభించింది. ఈ మేరకు ఏపీ ఇంధనపొదుపు సంస్థ సీఈవో చంద్రశేఖర్ రెడ్డి సంబంధిత వివరాలను శుక్రవారం మీడియాకు తెలిపారు.
ఇంధనపొదుపు అమలులో ప్రపంచబ్యాంక్ ప్రకటించిన ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌కు మొదటి స్థానం లభించిదని, తర్వాత స్థానాల్లో వరుసగా రాజస్థాన్, కర్నాటక, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, ఢిల్లీ, పంజాబ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ ఉన్నాయని చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఓ అంతర్జాతీయ కార్యక్రమంలో ప్రపంచబ్యాంక్ ఎగ్జికూటివ్ డెరైక్టర్ సుభాష్‌చంద్ర గార్గ్ ఇంధన పొదుపుపై వరల్డ్‌బ్యాంక్ రూపొందించినర్యాంకుల నివేదికను ప్రకటించారని, 650 మెగావాట్ల ఇంధన పొదుపు వల్ల రాష్ట్రంలో గడిచిన రెండేళ్ళలో 1500 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయినట్టు గుర్తించారని, అందుకే ఏపీకి ఫస్ట్ ర్యాంక్ దక్కిందని ప్రకటనలో పేర్కొన్నారు.