గ్రామీణ వికాస్ బ్యాంకు ఒకేసారి 24 శాఖలు
గాజువాక: ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ఒకేసారి 24 శాఖలను ప్రారంభించింది. ఆన్‌లైన్ ద్వారా శ్రీకాకుళం జిల్లాలో 10 , విజయనగరం జిల్లాలో 3 , విశాఖపట్నం జిల్లాలో 11 శాఖలను ఏకకాలంలో ప్రారంభించారు. పెదగంట్యాడ మండలం వుడా కాలనీ వద్ద ఆ బ్యాంకు శాఖను సోమవారం ప్రారంభించిన అనంతరం మిగిలిన శాఖలను కూడా ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారతీయ స్టేట్ బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్, హైదరాబాద్ ఎల్‌హెచ్‌వో సి.ఆర్.శశికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
బ్యాంకు చైర్మన్ వి.నర్సిరెడ్డి మాట్లాడుతూ 1.74 లక్షల స్వయం సహాయక సంఘాలకు ఆర్‌ఆర్‌బీ ద్వారా ఇప్పటివరకు రూ.3,298.56 కోట్ల రుణాలను మంజూరు చేయగా, వాటిలో ఉత్తరాంధ్ర జిల్లాలకు 80 శాతం రుణాలను తమ బ్యాంకు మంజూరు చేసిందన్నారు. ప్రజల ముంగిట్లోకి గ్రామీణ వికాస్ బ్యాంకు పేరుతో ఇప్పటివరకు తాము రూ.3,444.97 కోట్ల వ్యవసాయ రుణాలను అందజేశామన్నారు. సుమారు కోటి మంది ఖాతాదారులతో రూ.8178.32 కోట్ల డిపాజిట్లను కలిగి ఉన్నామన్నారు. కార్యక్రమంలో బ్యాంకు జీఎం వైఎన్ సుకుమార్, సర్కిల్ మేనేజర్ ఎన్‌ఎస్ ప్రసాద్, విశాఖ రీజనల్ మేనేజర్ బిఎస్‌ఎన్ రాజు, శ్రీకాకుళం ఆర్‌ఎం డి.వి.రమణ, విజయనగరం ఆర్‌ఎం బాల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.