Grameena Vikas Bank
-
జీవీ బ్యాంక్‌లో ఇంటి దొంగలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీ జీవీబీ)కు ఇంటి దొంగలే కుచ్చుటోపీ పెట్టారు. గృహరుణాల పేరుతో అప్పటికే లోన్లు తీసుకున్న ఖాతాదారుల డాక్యుమెంట్లు పెట్టి, ఫోర్జరీ సంతకాలతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఈ వ్యవహారంపై ఏపీజీవీబీ రీజినల్ మేనేజర్ సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో ముగ్గురు బ్యాంకు అధికారులపై కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఖాతాదారుల సంతకాలు ఫోర్జరీ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఇస్నాపూర్ బ్రాంచ్ లో ఫీల్డ్ అధికారిగా పనిచేస్తున్న చిత్తూరు జిల్లా వాసి పి.దుర్గాప్రసాద్.. అదే బ్యాంకుకు చెందిన ఇద్దరు బ్రాంచ్ మేనేజర్లు ఎస్వీ రమణమూర్తి, ఎ.ప్రభాకర్‌తో కలిసి ఇంటి లోన్ల పేరిట రూ.5.2కోట్లు దండుకున్నారు. ఏపీ జీవీబీలో అప్పటికే 15మంది ఖాతాదారులు ఇంటి లోన్ తీసుకున్నారు. ఆ సమయంలో ఖాతాదారులు ష్యూరిటీగా సమర్పించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను తీసుకొని దుర్గాప్రసాద్ అండ్ కో, మరో 15 గృహరుణాల నకిలీ దరఖాస్తులు సృష్టించి, ఖాతా దారుల సంతకాలను ఫోర్జరీ చేసి రూ.5.2 కోట్ల నగదు ఆ ఖాతాదారుల బ్యాంకు ఖాతా లోకి మళ్లించారు. లోన్ తీసుకున్నప్పుడు కస్టమర్లు ముందస్తు ఓచర్స్‌పై చేసిన సంతకాలను ఉపయోగించి కొంతనగదును దుర్గాప్రసాద్ బంజారాహిల్స్‌లోని తన కోటక్ మహీంద్రా అకౌంట్, విక్రంపురిలోని హెచ్డీఎఫ్సీ ఖాతాలోకి మళ్లించాడని రీజనల్ మేనేజర్ మల్లెంపాటి రవి మంగళవారం సీబీఐ జేడీ చంద్రశేఖర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దుర్గాప్రసాద్ తన బ్యాంక్ ఖాతాలోకి మళ్లించుకున్న నగదుతో పాటు ప్రీ ఓచర్స్‌తో లోన్ డబ్బును డ్రా చేసుకొన్నట్లు సీబీఐ గుర్తించింది. -
రూ.20వేల కోట్లు దాటిన ఏపీజీవీబీ
♦ లాభం 11% అప్, రూ.223 కోట్లు ♦ బ్యాంకు చైర్మన్ వి.నర్సిరెడ్డి వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) నికర లాభం సుమారు 11 శాతం వృద్ధితో రూ. 202 కోట్ల నుంచి రూ. 223 కోట్లకు పెరిగింది. వ్యాపార పరిమాణం రూ.20,804 కోట్లకు చేరింది. తద్వారా రూ.20 వేల కోట్ల మైలురాయి అధిగమించిన అతి కొద్ది గ్రామీణ బ్యాంకుల జాబితాలో తాము కూడా చేరినట్లు ఏపీజీవీబీ చైర్మన్ వి.నర్సిరెడ్డి సోమవారం ఇక్కడ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా విలేకరులతో చెప్పారు. నిర్వహణ లాభం అధికంగానే ఉన్నప్పటికీ మొండి బకాయిల కోసం కేటాయింపులు పెంచాల్సి రావటం వల్ల నికర లాభం కొంత తగ్గినట్లు వివరించారు. నికర వడ్డీ ఆదాయం 12 శాతం మేర పెరిగినట్లు పేర్కొన్నారు. తగ్గిన ఎన్పీఏలు... లోక్ అదాలత్‌ల నిర్వహణ, రికవరీ చట్టాన్ని సమర్ధంగా అమలు చేయటం వంటి చర్యలతో నికర ఎన్పీఏలు గణనీయంగా 2.32 శాతం నుంచి 1.40 శాతానికి తగ్గాయని నర్సిరెడ్డి తెలియజేశారు. డిపాజిట్ల వృద్ధి 23 శాతం (రూ.1,922 కోట్లు), రుణాల వృద్ధి 17 శాతం (రూ. 1,536 కోట్లు) గాను ఉందని చెప్పారు. కరెంటు అకౌంటు, సేవింగ్స్ అకౌంటు (కాసా) నిష్పత్తి 0.65 శాతం మేర పెరిగింది. లక్ష్యాలను ప్రస్తావిస్తూ... ప్రస్తుతం తమకు 752 శాఖలున్నాయని, ఈ ఆర్థిక సంవత్సరం మరో 50 జత చేయాలని యోచిస్తున్నామని ఆయన చెప్పారు. ‘‘సిబ్బంది కొరత ప్రధాన సమస్యగా ఉంటోంది. రిక్రూట్మెంట్లో పాత విధానాన్ని పునరుద్ధరిస్తే ఈ సమస్య అధిగమించగలమనే నమ్మకం ఉంది’’ అని చెప్పారాయన. బ్యాంకు సిబ్బంది ప్రస్తుతం 3,070 పైచిలుకు ఉండగా, కొత్త శాఖల కోసం అదనంగా 150 మంది అవసరమవుతారని తెలియజేశారు. ఇప్పుడు 4.5 శాతంగా ఉన్న చిన్న, మధ్య తరహా సంస్థలకిచ్చే రుణాల పరిమాణాన్ని 7 శాతానికి పెంచుకోవటంతో పాటు సౌరవిద్యుత్ పంపుసెట్లు మొదలైన వాటికి రుణాలపై దృష్టి పెడుతున్నామని నర్సిరెడ్డి వివరించారు. ప్రత్యామ్నాయ డెలివరీ చానల్స్ లావాదేవీలను 19.3 శాతం నుంచి 30 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు తెలియజేశారు. -
గ్రామీణ వికాస్ బ్యాంక్ లో లాకర్ ధ్వంసం
ఖమ్మం: ఖమ్మం జిల్లా పినపాక మండలం కరకగూడెంలో బ్యాంక్ చోరి యత్నం జరిగింది. మండలంలోని గ్రామీణ వికాస్ బ్యాంక్ లో దుండుగులు చోరీకి విఫల యత్నం చేశారు. బుధవారం అర్థరాత్రి బ్యాంక్ లోకి ప్రవేశించిన దొంగలు లాకర్ ను పగులకొట్టేందుకు ప్రయత్నించారు. అయితే లాకర్ ఎంతకీ తెరుచుకోకపోవడంతో పరారయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
గ్రామీణ వికాస్ బ్యాంకు ఒకేసారి 24 శాఖలు
గాజువాక: ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ఒకేసారి 24 శాఖలను ప్రారంభించింది. ఆన్లైన్ ద్వారా శ్రీకాకుళం జిల్లాలో 10 , విజయనగరం జిల్లాలో 3 , విశాఖపట్నం జిల్లాలో 11 శాఖలను ఏకకాలంలో ప్రారంభించారు. పెదగంట్యాడ మండలం వుడా కాలనీ వద్ద ఆ బ్యాంకు శాఖను సోమవారం ప్రారంభించిన అనంతరం మిగిలిన శాఖలను కూడా ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారతీయ స్టేట్ బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్, హైదరాబాద్ ఎల్‌హెచ్‌వో సి.ఆర్.శశికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బ్యాంకు చైర్మన్ వి.నర్సిరెడ్డి మాట్లాడుతూ 1.74 లక్షల స్వయం సహాయక సంఘాలకు ఆర్ఆర్బీ ద్వారా ఇప్పటివరకు రూ.3,298.56 కోట్ల రుణాలను మంజూరు చేయగా, వాటిలో ఉత్తరాంధ్ర జిల్లాలకు 80 శాతం రుణాలను తమ బ్యాంకు మంజూరు చేసిందన్నారు. ప్రజల ముంగిట్లోకి గ్రామీణ వికాస్ బ్యాంకు పేరుతో ఇప్పటివరకు తాము రూ.3,444.97 కోట్ల వ్యవసాయ రుణాలను అందజేశామన్నారు. సుమారు కోటి మంది ఖాతాదారులతో రూ.8178.32 కోట్ల డిపాజిట్లను కలిగి ఉన్నామన్నారు. కార్యక్రమంలో బ్యాంకు జీఎం వైఎన్ సుకుమార్, సర్కిల్ మేనేజర్ ఎన్ఎస్ ప్రసాద్, విశాఖ రీజనల్ మేనేజర్ బిఎస్ఎన్ రాజు, శ్రీకాకుళం ఆర్ఎం డి.వి.రమణ, విజయనగరం ఆర్ఎం బాల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకులో భారీ చోరీ
బ్యాంకులకు భద్రత ఏదీ? - కలకలం రేపిన ఏపీజీవీబీ దొంగతనం - ఆందోళనలో ఖాతాదారులు జడ్చర్ల : ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించి ప్రధాన వనరులుగా ఉన్న బ్యాంకులకే భద్రత కరువైతే ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి బాలానగర్‌లోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ) లో జరిగిన దొంగతనం ఒక్కసారిగా కలకలం రేపింది. ఈ బ్యాంకులో కుదువ పెట్టుకున్న బంగారు నగలకు సంబంధించి 13.5 కిలోల బంగారు నగలను, *15 లక్షలను దొంగలు అపహరించిన ఘటన ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. పోలీస్ స్టేషన్‌కు అతి సమీపంలో జాతీయ రహదారిని అనుసరించి ఉన్న బ్యాంకులో దొంగతనం చోటుచేసుకోవడం పోలీసులను సైతం కలవరపాటుకు గురిచేసింది. ఇందులో బంగారం కుదువపెట్టి రుణాలు తీసుకున్న ఖాతాదారులు ఆందోళనకు గురయ్యారు. తమ సొమ్ము ఇక చేతికి అందుతుందా లేదోనన్న అనుమానాలు వ్యక్తం చేశారు. రికార్డులను పరిశీలించి తమ బంగారం తూకం ప్రకారం ఇచ్చినా వాటిని నగలుగా మార్చుకోవడానికి కూడా తయారీ ఖర్చులు భారమవుతాయన్నారు. ఇదిలాఉండగా గత ఏడాది సెప్టెంబర్ 23వ తేదీ రాత్రి జడ్చర్ల మండలం గంగాపూర్‌లోని ఏపీజీవీబీలో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి యత్నించారు. అలాగే బాదేపల్లి ఎస్బీహెచ్ ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేసి నగదును ఎత్తుకు వెళ్లేందుకు విఫలయత్నం చేశారు. పోలీసులు విచారణ చేసి సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించి చర్యలు తీసుకున్నారు. అక్కడక్కడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నా అటు బ్యాంకు అధికారులు గాని, ఇటు పోలీసులుగాని బ్యాంకుల భద్రతపై దృష్టి సారించడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రాత్రివేళ పోలీసులు బ్యాంకుల దగ్గర బందోబస్తు చర్యలు చేపట్టి దొంగతనాలను అరికట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కాలనీలలో, ప్రధాన రహదారులపై గస్తీ పెంచాలన్నారు. చోరీ అయిన ఆభరణాల విలువ రూ.4 కోట్లు నిందితులను కఠినంగా శిక్షించాలి : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాలానగర్ : తమ అవసరాల నిమిత్తమో లేక బ్యాంకులో భద్రంగా ఉంటాయన్న ఆలోచనతోనో మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ) లో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎంతో విలువైన తమ బంగారు ఆభరణాలను పెట్టి రుణాలు తీసుకున్నారు. అయితే ఈ బ్యాంకులో దొంగలు పడ్డట్లు తెలియడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. వివరాలు.. బాలానగర్ బస్టాండు కూడలిలో పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఈ బ్యాంకులో ఆదివారం అర్ధరాత్రి దొంగలు చొరబడి 15 లక్షలతో పాటు 13.5 కిలోల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఇదిలాఉండగా అక్కడ సెక్యూరిటీ గార్డు గాని, అల్లారం ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ దోపిడీ జరిగిందనే ఆరోపణలున్నాయి. రాత్రివేళలో పెట్రోలింగ్ లేకపోవడమే వల్లే తరచూ దొంగతనాలు జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. బ్యాంకులో మొత్తం 2.4 కోట్ల బంగారు రుణాలు ఇచ్చామని, వాటి విలువ నాలుగు కోట్లకు పైనే ఉంటుందని మేనేజర్ రవికిశోర్‌రెడ్డి తెలిపారు. ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బంగారం సంబంధించిన రికార్డులు భద్రంగానే ఉన్నాయన్నారు. అనంతరం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాల్‌రాజు, శ్రీనివాస్‌గౌడ్ ఈ బ్యాంకును పరిశీలించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. -
బాలానగర్ బ్యాంకులో భారీ దోపిడీ!
మహబూబ్‌నగర్ జిల్లాలోని బాలానగర్ గ్రామీణ వికాస్ బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. గ్యాస్ కట్టర్లతో లాకర్లను కట్ చేసి నగలు, నగదును దుండగులు దోచుకెళ్లారు. 4 కోట్ల రూపాయల విలువైన బంగారు నగలతో పాటు 16-18 లక్షల రూపాయల నగదు కూడా ఈ దోపిడీలో అపహరణకు గురైంది. బ్యాంకు వెనకభాగం నుంచి దొంగలు ప్రవేశించారు. నిత్యం రద్దీగా ఉండే జాతీయరహదారి పక్కనే ఉంటుంది. జనవాసాల మధ్య, పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఉంటుంది. రైతులు రుణాల కోసం కుదువపెట్టిన బంగారమే పెద్ద ఎత్తున పోయినట్లు తెలుస్తోంది. బ్యాంకు సిబ్బంది ప్రమేయం, సెక్యూరిటీ గార్డు ప్రమేయం ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు విషయాలు బాగా తెలిసినవాళ్లే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో బ్యాంకులలో చోరీలు, దోపిడీలకు ప్రయత్నాలు జరిగినా.. ఇంత పెద్ద ఎత్తున పోవడం మాత్రం ఇదే మొదటిసారి. -
నీట మునిగి ఐదుగురు మృతి
* తాత కర్మకాండలకు వచ్చి కానరాని లోకాలకు * నల్లగొండ జిల్లా డిండి రిజర్వాయర్‌లో ఘటన * మృతుల్లో అన్నాతమ్ముడు, అక్కాచెల్లెలు డిండి : తాత దశదినకర్మలకు వచ్చిన మనవళ్లు, మనుమరాళ్లు ప్రమాదవశాత్తు నీటి మునిగి మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన సోమవారం నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టు రిజర్వాయర్‌లో జరిగింది. అన్నా తమ్ముడు, అక్కా చెల్లెలు, మరో బంధువు కలసి మొత్తం ఐదుగురు మృత్యువాత పడ్డారు. వివరాలలోకి వెళితే... డిండి మండలకేంద్రానికి చెందిన దోవతి మల్లారెడ్డికి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమారుడు దత్తారెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో గ్రామీణ వికాస్‌బ్యాంకులో క్యాషియర్ కాగా, రెండో కుమారుడు కరుణాకర్‌రెడ్డి డిండిలోనే టైలర్‌గా పనిచేస్తున్నాడు. మూడో కుమారుడు సుధాకర్‌రెడ్డి హైదరాబాద్‌లో ఫైనాన్స్ కన్సల్టెంట్. పదిరోజుల క్రితం మల్లారెడ్డి (85) అనారోగ్యంతో మృతిచెందాడు. డిండిలో ఆదివారం జరిగిన ఆయన దశదినకర్మలకు కుమారులు, కూతుళ్లతో పాటు వారి పిల్లలు, బంధువులు హాజరయ్యారు. వారంతా రాత్రి అక్కడే బస చేశారు. సోమవారం దత్తారెడ్డి కుమారులు హర్షవర్దన్‌రెడ్డి(30), ప్రణీత్‌రెడ్డి(20), కరుణాకర్‌రెడ్డి కుమార్తెలు జ్యోత్స్న(20), దేవమణి(17), సుధాకర్‌రెడ్డి కుమారుడు అరవింద్‌రెడ్డి, మల్లారెడ్డి బావమరిది నర్సిరెడ్డి (వరంగల్ జిల్లా లింగాలఘనపురం మండలంలోని వనపర్తి) కుమారుడు అవినాష్‌రెడ్డి(20), బంధువుల అమ్మాయి మొత్తం ఏడుగురు కలసి డిండి ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లో స్నానం చేసేందుకు వెళ్లారు. హర్షవర్దన్‌రెడ్డి, ప్రణీత్‌రెడ్డి, జ్యోత్స్న, దేవమణి నీటిలోకి వెళ్లగా అరవింద్‌రెడ్డిని కెమెరాతో ఫొటో తీయమన్నారు. కొంచెం లోపలికి వెళ్లేసరికి నలుగురూ నీటిలో మునిగారు. వారిని రక్షించేందుకు వెళ్లిన అవినాష్‌రెడ్డి కూడా నీటిలో మునిగిపోయాడు. ఒడ్డున ఉన్న అరవింద్‌రెడ్డి, బంధువుల అమ్మాయి ఏడుస్తూ ఇంటికి వెళ్లి విషయం కుటుంబసభ్యులకు తెలిపారు. స్థానిక మత్స్యకారులు, గ్రామస్తులు కూడా పెద్దఎత్తున ప్రాజెక్టు వద్దకు చేరుకుని గాలింపు చేపట్టి ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. సంఘటన స్థలంలో మృతుల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. డిండి పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొం డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కలెక్టర్ చిరంజీవులు, ఎస్పీ ప్రభాకర్‌రావు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మృతదేహాలను సందర్శించారు. మూడు కుటుంబాల్లో గర్భశోకం.. దత్తారెడ్డి కుమారులు హర్షవర్దన్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, ప్రణీత్‌రెడ్డి ఎమ్మెస్సీ ఎంట్రన్స రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాడు. కరుణాకర్‌రెడ్డి పెద్దకూతురు జ్యోత్స్న హైదరాబాద్‌లోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. దేవమణి డిండిలోని మోడల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. బీటెక్ పూర్తిచేసిన అవినాష్‌రెడ్డి నర్సిరెడ్డి ఒక్కగానొక్క కుమారుడు. నీటమునిగి ఈ మూడు కుటుంబాలకు చెందిన ఐదుగురు పిల్లలు మృత్యువాత పడి తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చారు. ఘటనపై తక్షణం స్పందించిన కేసీఆర్ హైదరాబాద్: నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టు రిజర్వాయర్‌లో మునిగి ఐదుగురు మృతిచెందిన ఘటనపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వెంటనే స్పందించారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి గాలింపుచర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. అయితే, నాయిని డిండి వెళ్లేందుకు సిద్ధమవుతుండగానే మృతదేహాలను వెలికితీశారనే సమాచారం అందడంతో కేసీఆర్ ఆయన్ను వెనక్కి రప్పించారు. -
బ్యాంక్ దోపిడీకి విఫలయత్నం
శివ్వంపేట, న్యూస్‌లైన్ : మండల పరిధిలోని గ్రామీణ వికాస్ బ్యాంక్ గోమారం శాఖ కార్యాలయంలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు దోపిడీకి విఫలయత్నం చేశారు. తుప్రాన్ సీఐ రవీందర్‌రెడ్డి కథనం మేరకు.. గుర్తు తెలియని వ్యక్తులు బ్యాం క్ ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బ్యాంక్ లోపల మూడు సీసీ కెమెరాలు ఉండగా అందు లో ఒకదాని కనెక్షన్ తొలగించి మరో దా న్ని గోడ వైపునకు తిప్పారు. అనంతరం లాకర్లు ఉన్న అల్మరాను ధ్వంసం చేసి తలుపులు తెరిచారు. అందులో డబ్బు లేకపోవడంతో పక్కనే ఉన్న లాకర్లను తెరిచేందుకు విశ్వప్రయత్నం చేశారు. అవి తెరుచుకోక పోవడంతో దుండగులకు డబ్బు, నగలు లభ్యం కాలేదు. చోరీ యత్నానికి సంబంధించిన వివరాలను బ్యాంక్ సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను ఈ సందర్భంగా పరిశీలించాం. బ్యాంక్ లోనికి చొరవడిన ఇద్దరు వ్యక్తులు మొహానికి మాస్కులు, చేతులకు గ్లౌజులు ధరించారు. ఇదిలా ఉండగా సంఘటనా స్థలాన్ని గ్రామీణ వికాస్ బ్యాంక్ డివిజనల్ మేనేజర్ పీవీ కృష్ణారెడ్డి పరిశీలించారు. బ్యాంక్‌లో ఎలాంటి సొమ్మూ పోలేదని శాఖ మేనేజర్ ఎం ప్రభాకర్‌రావు తెలిపారు. బ్యాంక్ చోరీకి ప్రయత్నించిన దుండగులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ రవీందర్‌రెడ్డి తెలిపారు. పలు ఆధారాల కోసం క్లూస్ టీం సిబ్బంది ఆధారాలు సేకరించారు. ప్రారంభించిన ఐదు నెలలకే చోరీ గ్రామంలో గ్రామీణ వికాస్ బ్యాంక్ శాఖను ఐదు నెలల క్రితం రాష్ట్ర మంత్రి సునీతారెడ్డి ప్రారంభించారు. పదిహేను సంవత్సరాల క్రితం గ్రామంలో ఉన్న బ్యాంక్‌లో లావాదేవీలు సక్రమంగా జరగకపోవడం, అదే సమయంలో చోరీ కూడా జరిగింది. దీంతో సంబంధిత అధికారులు బ్యాంక్‌ను నర్సాపూర్‌కు తరలించారు. అయితే గ్రామస్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మం త్రి చొరవతో తిరిగి శాఖను ఇటీవల ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బ్యాం క్ దోపిడీకి యత్నించడం గమనార్హం.