రూ.20వేల కోట్లు దాటిన ఏపీజీవీబీ
♦ లాభం 11% అప్, రూ.223 కోట్లు
♦ బ్యాంకు చైర్మన్ వి.నర్సిరెడ్డి వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) నికర లాభం సుమారు 11 శాతం వృద్ధితో రూ. 202 కోట్ల నుంచి రూ. 223 కోట్లకు పెరిగింది. వ్యాపార పరిమాణం రూ.20,804 కోట్లకు చేరింది. తద్వారా రూ.20 వేల కోట్ల మైలురాయి అధిగమించిన అతి కొద్ది గ్రామీణ బ్యాంకుల జాబితాలో తాము కూడా చేరినట్లు ఏపీజీవీబీ చైర్మన్ వి.నర్సిరెడ్డి సోమవారం ఇక్కడ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా విలేకరులతో చెప్పారు. నిర్వహణ లాభం అధికంగానే ఉన్నప్పటికీ మొండి బకాయిల కోసం కేటాయింపులు పెంచాల్సి రావటం వల్ల నికర లాభం కొంత తగ్గినట్లు వివరించారు. నికర వడ్డీ ఆదాయం 12 శాతం మేర పెరిగినట్లు పేర్కొన్నారు.
తగ్గిన ఎన్‌పీఏలు...
లోక్ అదాలత్‌ల నిర్వహణ, రికవరీ చట్టాన్ని సమర్ధంగా అమలు చేయటం వంటి చర్యలతో నికర ఎన్‌పీఏలు గణనీయంగా 2.32 శాతం నుంచి 1.40 శాతానికి తగ్గాయని నర్సిరెడ్డి తెలియజేశారు. డిపాజిట్ల వృద్ధి 23 శాతం (రూ.1,922 కోట్లు), రుణాల వృద్ధి 17 శాతం (రూ. 1,536 కోట్లు) గాను ఉందని చెప్పారు. కరెంటు అకౌంటు, సేవింగ్స్ అకౌంటు (కాసా) నిష్పత్తి 0.65 శాతం మేర పెరిగింది. లక్ష్యాలను ప్రస్తావిస్తూ... ప్రస్తుతం తమకు 752 శాఖలున్నాయని, ఈ ఆర్థిక సంవత్సరం మరో 50 జత చేయాలని యోచిస్తున్నామని ఆయన చెప్పారు. ‘‘సిబ్బంది కొరత ప్రధాన సమస్యగా ఉంటోంది.
రిక్రూట్‌మెంట్‌లో పాత విధానాన్ని పునరుద్ధరిస్తే ఈ సమస్య అధిగమించగలమనే నమ్మకం ఉంది’’ అని చెప్పారాయన. బ్యాంకు సిబ్బంది ప్రస్తుతం 3,070 పైచిలుకు ఉండగా, కొత్త శాఖల కోసం అదనంగా 150 మంది అవసరమవుతారని తెలియజేశారు. ఇప్పుడు 4.5 శాతంగా ఉన్న చిన్న, మధ్య తరహా సంస్థలకిచ్చే రుణాల పరిమాణాన్ని 7 శాతానికి పెంచుకోవటంతో పాటు సౌరవిద్యుత్ పంపుసెట్లు మొదలైన వాటికి రుణాలపై దృష్టి పెడుతున్నామని నర్సిరెడ్డి వివరించారు. ప్రత్యామ్నాయ డెలివరీ చానల్స్ లావాదేవీలను 19.3 శాతం నుంచి 30 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు తెలియజేశారు.