సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీ జీవీబీ)కు ఇంటి దొంగలే కుచ్చుటోపీ పెట్టారు. గృహరుణాల పేరుతో అప్పటికే లోన్లు తీసుకున్న ఖాతాదారుల డాక్యుమెంట్లు పెట్టి, ఫోర్జరీ సంతకాలతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఈ వ్యవహారంపై ఏపీజీవీబీ రీజినల్ మేనేజర్ సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో ముగ్గురు బ్యాంకు అధికారులపై కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది.
ఖాతాదారుల సంతకాలు ఫోర్జరీ
గ్రామీణ వికాస్ బ్యాంక్ ఇస్నాపూర్ బ్రాంచ్ లో ఫీల్డ్ అధికారిగా పనిచేస్తున్న చిత్తూరు జిల్లా వాసి పి.దుర్గాప్రసాద్.. అదే బ్యాంకుకు చెందిన ఇద్దరు బ్రాంచ్ మేనేజర్లు ఎస్వీ రమణమూర్తి, ఎ.ప్రభాకర్‌తో కలిసి ఇంటి లోన్ల పేరిట రూ.5.2కోట్లు దండుకున్నారు. ఏపీ జీవీబీలో అప్పటికే 15మంది ఖాతాదారులు ఇంటి లోన్ తీసుకున్నారు. ఆ సమయంలో ఖాతాదారులు ష్యూరిటీగా సమర్పించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను తీసుకొని దుర్గాప్రసాద్ అండ్ కో, మరో 15 గృహరుణాల నకిలీ దరఖాస్తులు సృష్టించి, ఖాతా దారుల సంతకాలను ఫోర్జరీ చేసి రూ.5.2 కోట్ల నగదు ఆ ఖాతాదారుల బ్యాంకు ఖాతా లోకి మళ్లించారు.
లోన్ తీసుకున్నప్పుడు కస్టమర్లు ముందస్తు ఓచర్స్‌పై చేసిన సంతకాలను ఉపయోగించి కొంతనగదును దుర్గాప్రసాద్ బంజారాహిల్స్‌లోని తన కోటక్ మహీంద్రా అకౌంట్, విక్రంపురిలోని హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాలోకి మళ్లించాడని రీజనల్ మేనేజర్ మల్లెంపాటి రవి మంగళవారం సీబీఐ జేడీ చంద్రశేఖర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దుర్గాప్రసాద్ తన బ్యాంక్ ఖాతాలోకి మళ్లించుకున్న నగదుతో పాటు ప్రీ ఓచర్స్‌తో లోన్ డబ్బును డ్రా చేసుకొన్నట్లు సీబీఐ గుర్తించింది.
జీవీ బ్యాంక్‌లో ఇంటి దొంగలు
Published Wed, Nov 1 2017 3:47 AM | Last Updated on Wed, Oct 3 2018 6:52 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment