సాక్షి, అమరావతి: నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజుపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగవేసినందుకు ఆయనపై ఇటీవల సీబీఐ కేసు నమోదు చేసి ఏకకాలంలో ఆయన ఆఫీసు, ఇళ్లపైన సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా ఫోర్జరీ పత్రాలతో బ్యాంకులకు టోకరా వేసినందుకు సీబీఐ కేసు నమోదు చేసింది. పథకం ప్రకారం ఫోర్జరీ పత్రాలతో రూ.237.84 కోట్ల రుణం తీసుకుని మోసం చేసినట్టు చెన్నై ఎస్‌బీఐ డీజీఎం ఎస్.రవిచంద్రన్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఢిల్లీలో సీబీఐ ఎస్పీ అశోక్‌కుమార్ కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్ వివరాలను సీబీఐ కార్యాలయం గురువారం విడుదల చేసింది. రఘురామకృష్ణరాజుతోపాటు కంపెనీ డైరెక్టర్లుగా ఉన్న ఆయన భార్య, కుమార్తె, ఇంకా పలువురిపై కేసు నమోదైంది.
తమిళనాడులోని తూత్తుకూడిలో ఇండ్ భారత్ పవర్ జెన్‌కం లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు పేరుతో ఫోర్జరీ పత్రాలు పెట్టి రుణంగా పొందిన రూ.237.84 కోట్ల మొత్తాన్ని పక్కదారి పట్టించినట్టు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. రఘురామకృష్ణరాజుతోపాటు కంపెనీ డైరెక్టర్లపై ఐపీసీ 120బి రెడ్ విత్ 420, 467, 468, 471తోపాటు పీసీ యాక్ట్–1988 ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఆయన బ్యాంకులను మోసం చేయాలనే ఉద్దేశపూర్వకమైన నేర స్వభావంతోనే పథకం ప్రకారం ఫోర్జరీ పత్రాలతో కోట్లాది రూపాయలను బ్యాంకుల నుంచి రుణంగా పొందినట్టు సీబీఐ పేర్కొంది. ఈ కేసులో ఎంపీ రఘురామకృష్ణరాజు, కనుమూరు రమాదేవి, కనుమూరు ఇందిరా ప్రియదర్శిని, అంబేద్కర్ రాజ్‌కుమార్ గంటా, దుంపల మధుసూదనరెడ్డి, నారాయణప్రసాద్ భాగవతుల, రామచంద్ర అయ్యర్ బాలకృష్ణ.. మరికొందరిని నిందితులుగా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment