రఘురామ కృష్ణంరాజు పిటిషన్‌ను అడ్డుకునేందుకు కుట్ర అంటూ ఆరోపణ
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు నిబంధనలను పాటించినట్టు చూపడం కోసం ఫోర్జరీ సంతకం చేశారని, సర్వోన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించబోయారంటూ ఇద్దరు న్యాయవాదులు, ఓ క్లర్కుపై సుప్రీంకోర్టు న్యాయవాది గల్లా సతీష్ అటు పోలీసులకు, ఇటు కోర్టు రిజిస్ట్రీకి ఫిర్యాదు చేశారు. కోర్టు ఆవరణలో గురువారం సాయంత్రం ఆయన మీడియాకు ఈ సంగతి వెల్లడించారు. రాష్ట్ర విభజనను సవాల్‌చేస్తూ తమ క్లయింటు పారిశ్రామికవేత్త కె.రఘురామ కృష్ణంరాజు దాఖలుచేసిన ప్రధాన పిటిషన్‌ను అడ్డుకొనే ధ్యేయంతోనే సుప్రీంకోర్టు న్యాయవాది, ఢిల్లీ టీజాక్ నాయకుడు రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడి కుమారుడు, క్లర్కు అయిన నరసింహారెడ్డి, మరో న్యాయవాది విద్యానందం ఈ ఫోర్జరీ వ్యవహారానికి పాల్పడ్డారన్నారు. దీనికి సంబంధించిన పూర్వాపరాలను ఆయన వివరిస్తూ, సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం అప్పటికే దాఖలైన ఓ పిటిషన్‌కు సంబంధించి మరేదైనా దరఖాస్తు, పిటిషన్‌ను వేరొకరు దాఖలు చేస్తే సదరు వ్యక్తులు ప్రధాన పిటిషనర్ న్యాయవాదులకు తమ పిటిషన్ ప్రతిని ఇచ్చి వారికి అందినట్టుగా సంబంధిత పత్రంపై సంతకం తీసుకుని దానిని కోర్టు రిజిస్ట్రీకి ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.
అయితే రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్‌ను అడ్డుకోవడంకోసం.. ఆయన వేరే కేసుల్లో నిందితుడిగా ఉన్నారని, అలాంటి వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోరాదంటూ సీనియర్ న్యాయవాది విద్యానందం ఓ పిటిషన్ వేశారని, కాని దీనికి సంబంధించి ఫోర్జరీ పత్రాలను రిజిస్ట్రీకి సమర్పించారని, గురువారం ఈ విషయం వెల్లడైందని తెలిపారు. దీనివెనక రామకృష్ణారెడ్డి, నరసింహారెడ్డి ఉన్నారని తిలక్‌మార్గ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, అలాగే కోర్టు రిజిస్ట్రీ విజిలెన్స్ విభాగానికి కూడా ఫిర్యాదు చేశామని గల్లా సతీష్ తెలిపారు. తమ ఫిర్యాదు మేరకు రిజిస్ట్రీ విద్యానందం, రామకృష్ణారెడ్డి, నరసింహారెడ్డిలను పిలిచి విచారించిందని వెల్లడించారు.
ఫోర్జరీ సంతకంతో మోసం
Published Fri, Nov 1 2013 2:58 AM | Last Updated on Wed, Oct 3 2018 6:52 PM
Advertisement