సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ రఘురామకృష్ణరాజు గాయాలపై సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా తొలగించడంపై రాష్ట్ర ప్రభుత్వ తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని నివేదించారు. సీఐడీ పోలీసు కస్టడీలో తన తండ్రిని హింసించారని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. భరత్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ పిటిషన్‌లో సీబీఐని ప్రతివాదిగా చేర్చాలని కోరారు. తొలుత ప్రతివాదులుగా చేర్చిన ఏపీ ప్రభుత్వం, మంగళగిరి స్టేషన్ హౌస్ ఆఫీసర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్, సీఐడీ ప్రాంతీయ కార్యాలయం ఏసీపీ ఆర్.విజయపాల్‌ను ప్రతివాదులుగా తొలగించాలని కోరారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే తీవ్ర అభ్యంతరం తెలిపారు.
ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినలేదని, సీబీఐని ఏ రకంగా ప్రతివాదిగా చేరుస్తారని అభ్యంతరం వ్యక్తం చేయడంతో ధర్మాసనం స్పందిస్తూ.. ప్రతివాదుల తొలగింపుపై పిటిషనర్ తరఫు న్యాయవాది రిస్క్ భరిస్తానని అంగీకరించారని పేర్కొంది. ‘ప్రతివాది నంబర్ 1గా ఎవరిని చేర్చారు? ఏపీ ప్రభుత్వాన్ని ఇపుడు ఎందుకు తొలగిస్తున్నారో అర్థం కావడం లేదు’ అని ధర్మాసనానికి దవే నివేదించారు. పిటిషనర్ తరపు న్యాయవాది రిస్క్ భరిస్తానంటున్నారు కదా? అని ధర్మాసనం పునరుద్ఘాటించింది. దవేకు ‘లోకస్ స్టాండీ’ లేదని, ఏపీ ప్రభుత్వాన్ని తొలగించాల్సిందేనని రోహత్గి పేర్కొనడంతో ఈ ప్రొసీడింగ్స్ హాస్యాస్పదంగా ఉన్నాయని దవే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో చాలా అంశాలు ఉన్నట్లుగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ ఆసక్తి ఉన్న పార్టీల వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వబోమని, కావాలనుకుంటే అప్లికేషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. కేంద్రం, సీబీఐలకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ ఆరు వారాల పాటు వాయిదా వేసింది. ఈలోగా ప్రతివాదులిద్దరూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
రఘురామ కేసులో ప్రతివాదిగా... రాష్ట్ర ప్రభుత్వం తొలగింపు
Published Wed, May 26 2021 3:39 AM | Last Updated on Wed, May 26 2021 7:06 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment