అరుదుగానే సీబీ‘ఐ’ | CBI report to High Court in Guntur police station attack case | Sakshi
Sakshi News home page

అరుదుగానే సీబీ‘ఐ’

Published Thu, Dec 24 2020 4:45 AM | Last Updated on Thu, Dec 24 2020 4:45 AM

CBI report to High Court in Guntur police station attack case - Sakshi

సాక్షి, అమరావతి: పాత గుంటూరు పోలీస్‌స్టేషన్‌పై దాడి కేసు దర్యాప్తు విషయంలో సీబీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తమ అభిప్రాయాన్ని బుధవారం హైకోర్టుకు తెలియజేసింది. సీబీఐ దర్యాప్తుకు హైకోర్టులు అరుదుగానే ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో స్పష్టంగా చెప్పిందని సీబీఐ నివేదించింది. జాతీయ భద్రత చట్టం నిర్ధేశించిన షెడ్యూల్డ్‌ నేరాల జాబితా పరిధిలోకి పోలీస్‌స్టేషన్‌పై దాడి ఘటన రాదని ఎన్‌ఐఏ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పిటిషనర్‌ వాదనలు విన్న న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.

2018లో పాత గుంటూరు పోలీస్‌స్టేషన్‌పై కొందరు ముస్లిం యువకులు దాడి చేసిన ఘటనకు సంబంధించి నమోదైన కేసుల్లో ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం గత ఆగస్టులో జీవో ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ గణేశ్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దాడి కేసును స్వతంత్ర దర్యా ప్తు సంస్థకు అప్పగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరుపుతున్న ధర్మాసనం.. సీబీఐ, ఎన్‌ఐఏ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఎన్‌ఐఏ ఎస్‌పీ సీవీ సుబ్బారెడ్డి, సీబీఐ ఎస్‌పీ పి.విమలాదిత్య, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజీత్‌ కౌంటర్లు దాఖలు చేశారు. బుధవారం ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని మరోసారి విచారించింది.

అసాధారణ కేసుల్లోనే ఆదేశించాలి: సీబీఐ
అసాధారణ కేసుల్లో మాత్రమే సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొందని సీబీఐ తరఫు న్యాయవాది పి.చెన్నకేశవులు తెలిపారు. షెడ్యూల్డ్‌ నేరాల జాబితాలోని దేశ భద్రత, ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, బాంబుపేలుళ్లు తదితర కేసుల్లో మాత్రమే తాము దర్యాప్తు చేస్తామని ఎన్‌ఐఏ తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌.హరినాథ్‌ తెలియజేశారు. 

ప్రాసిక్యూషన్‌ ఉపసంహరణ వెనుక దురుద్దేశాల్లేవు
పోలీస్‌స్టేషన్‌పై దాడికి సంబంధించి నమోదైన కేసుల్లో ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకుంటూ ఉత్తర్వులు జారీ చేయడం వెనుక ఎలాంటి దురుద్దేశాలు, రాజకీయ కారణాలు లేవ ని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. తాము సూచన మాత్రమే చేశామని, అంతిమ నిర్ణయం సంబంధిత మేజిస్ట్రేట్‌దేనని ప్రభుత్వ న్యాయవాది మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. అయితే దర్యాప్తు దశలో ఉన్న కేసుల్లో ప్రభుత్వం ప్రాసిక్యూషన్‌ను ఎలా ఉపసంహరించుకుంటుందని ధర్మాసనం ప్రశ్నించింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చే విషయంలో న్యాయస్థానం స్వీయ నియంత్రణ పాటించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉదహరిస్తూ సీబీఐ ఎస్‌పీ దాఖలు చేసిన కౌంటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి అఫిడవిట్‌ను తామెన్నడూ చూడలేదని వ్యాఖ్యానించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement