
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టడీ విచారణ వ్యవహారంపై హైకోర్టుకు ఎందుకు వెళ్లరు? ప్రతి వాళ్లు సుప్రీంకోర్టుకు వస్తే ఎలా’ అని రఘురామ కుమారుడి తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సీబీఐతో విచారణ చేయించాలన్న అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలని ఆదేశించింది. ఈమేరకు జస్టిస్ ఎఆర్ గవాయ్, జస్టిస్ సి.టి.రవిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రఘురామకృష్ణరాజు కస్టోడియల్ విచారణ వ్యవహారంలో సీబీఐతో విచారణ చేయించాలని ఆయన కుమారుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు రెండోసారి విచారణ చేపట్టింది. తొలిసారి విచారణ జరిగినప్పుడు సీబీఐకి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. బుధవారం విచారణ సందర్భంగా ఇప్పటివరకు కేంద్రం, సీబీఐ కౌంటర్లు దాఖలు చేయలేదని భరత్ తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు తెలిపారు.
ఈ పిటిషన్‌లో ప్రతివాదుల జాబితాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇతరులను ఎందుకు తొలగించారని ధర్మాసనం ప్రశ్నించగా.. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులే టార్చర్‌కు గురి చేశారని, నిర్ణయం తీసుకునే ముందు నిందితుల వాదనలు వినాల్సిన అవసరం లేదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులు ఉన్నాయని ఆయన చెప్పారు. హైకోర్టు విచారణ తర్వాతే తాము విచారణకు తీసుకుంటేనే అర్థం ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని భరత్ తరపు న్యాయవాదులను ధర్మాసనం ఆదేశించింది. దీనికి సమయం కావాలని పిటిషనర్ కోరగా, రెండు వారాల గడువు ఇచ్చింది.