రఘురామకు బెయిల్‌ నిరాకరణ | Supreme Court Denial of bail to Raghurama Krishnam Raju | Sakshi
Sakshi News home page

రఘురామకు బెయిల్‌ నిరాకరణ

Published Tue, May 18 2021 2:57 AM | Last Updated on Tue, May 18 2021 5:54 AM

Supreme Court Denial of bail to Raghurama Krishnam Raju - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర కేసులో అరెస్టయిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు బెయిలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తనకు రమేశ్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలన్న ఆయన విజ్ఞప్తిని కూడా తోసిపుచ్చింది. రఘురామకృష్ణరాజును సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించి తెలంగాణ హైకోర్టు నియమించే జ్యుడిషియల్‌ అధికారి పర్యవేక్షణలో వైద్య పరీక్షలు జరపాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరించి తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ద్వారా సీల్డ్‌ కవర్‌లో తమకు నివేదిక పంపాలని పేర్కొంది. దీనిపై ఈనెల 19వ తేదీలోగా కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. హైకోర్టు బెయిలు నిరాకరించడంతో రఘురామకృష్ణరాజు, ఆయన కుమారుడు భరత్‌ వేర్వేరుగా దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్లను సోమవారం విచారించిన జస్టిస్‌ వినీత్‌ శరణ్, జస్టిస్‌ బీఆర్‌ గవాయిలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది.

మంగళగిరి ఎయిమ్స్, మణిపాల్‌ ఆస్పత్రులను సూచించినా...
ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. ‘‘జ్యుడీషియల్‌ అధికారి సమక్షంలో రఘురామకృష్ణరాజుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించడానికి అభ్యంతరం లేదు. మంగళగిరిలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయవచ్చు. విజయవాడలోని మణిపాల్‌ ఆసుపత్రి(ప్రైవేట్‌)లో జరిపినా అభ్యంతరం లేదు’’ అని తెలిపారు. అయితే మంగళగిరిలోని ఎయిమ్స్‌ కొత్తగా ఏర్పాటైందని, తగినంత మంది సిబ్బంది లేరని, మణిపాల్‌ ఆసుపత్రి ప్రైవేట్‌ది అని రఘరామరాజు తరపు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి అభ్యంతరం వ్యక్తం చేశారు. రఘురామకృష్ణరాజును సొంత ఖర్చులతో ఢిల్లీ రావడానికి అనుమతించి ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు  చేయించాలని కోరారు. దీనికి కేంద్రం తరఫు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అభ్యంతరం చెప్పలేదు. అయితే సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స కాకుండా కేవలం వైద్య పరీక్షలు మాత్రమే నిర్వహించాలని దుష్యంత్‌ దవే కోరారు. 
సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రికి చేరుకున్న ఎంపీ 

ఖర్చులు పిటిషనరే భరించాలి...
‘ఆర్మీ ఆసుపత్రి హెడ్‌ ఆధ్వర్యంలో ముగ్గురు వైద్యులతో కూడిన మెడికల్‌ బోర్డు వైద్య పరీక్షలు నిర్వహించాలి. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఆర్మీ ఆసుపత్రిలోనే వైద్య సేవలు అందించాలి. దీన్ని జ్యుడీషియల్‌ కస్టడీగా భావించాలి. ఆర్మీ ఆసుపత్రిలో అయ్యే ఖర్చును పిటిషనర్‌ భరించాలి. స్పెషల్‌ లీవ్‌ పిటిషన్లపై కౌంటరు దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా రెండు రోజులు గడువు ఇస్తున్నాం. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు పిటిషనర్‌ కాపీలు అంజేయాలి. పిటిషనర్‌ రిజాయిండర్‌ను ఈ నెల 20లోగా దాఖలు చేయాలి. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేస్తున్నాం. ఈ ఆదేశాలు అమలు అయ్యేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్యలు తీసుకోవాలి. మా ఆదేశాలను ఈ–మెయిల్‌ ద్వారా తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్, ఏపీ హైకోర్టు, సీఎస్, సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుపత్రి హెడ్‌కు పంపాలి’’ అని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. 

సుప్రీంకోర్టును ఆశ్రయించిన టీవీ 5, ఏబీఎన్‌
ఈ వ్యవహారానికి సంబంధించి తమపైనా కేసు నమోదు చేయడంపై టీవీ 5, ఏబీఎన్‌ చానళ్లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సంస్థ, ఉద్యోగులపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని, సీఐడీ దర్యాప్తుపై స్టే ఇవ్వాలని కోరుతూ సోమవారం రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశాయి. 

ఆర్మీ ఆస్పత్రికి తరలింపు..
సాక్షి, గుంటూరు : సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎంపీ రఘురామకృష్ణరాజును అధికారులు గుంటూరు జిల్లా జైలు నుంచి సికింద్రాబాద్‌కు తరలించారు. జైళ్ల శాఖ డీజీపీ నుంచి ఉత్తర్వులు అందడంతో సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో పోలీసు భద్రత నడుమ వ్యక్తిగత వాహనంలో జైలు నుంచి ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement