సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి భూ కొనుగోళ్ల వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. అమరావతి భూముల కొనుగోళ్ల వ్యవహారంలో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై సీఐడీ విచారణ నిలిపేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం జస్టిస్ వినీత్‌శరణ్, జస్టిస్ దినేష్‌మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్‌ధావన్ వాదనలు వినిపించారు. ‘కేసు హైకోర్టుకు పంపండి. దర్యాప్తు కొనసాగనీయండి. మేం చట్ట పరిధిలోనే ముందుకెళ్లాం. సుప్రీంకోర్టు గతంలో ఎప్పుడూ దర్యాప్తును ఆపలేదు..’ అని ధావన్ పేర్కొన్నారు. దమ్మాలపాటి తరఫున సీనియర్ న్యాయవాది హరీష్‌సాల్వే వాదనలు వినిపిస్తూ.. పత్రాలు, ఎఫ్‌ఐఆర్ చదివితే అని చెబుతుండగా.. జస్టిస్ వినీత్‌శరణ్ జోక్యం చేసుకొని ఇరుపక్షాలు కోరితే వాటిని పరిశీలిస్తామని పేర్కొన్నారు. రాజీవ్‌ధావన్ హైకోర్టుకు పంపించాలని కోరుతున్నారు, మీ స్పందన ఏంటని ధర్మాసనం సాల్వేను ప్రశ్నించింది. ‘ఏడాది కాలంగా సుప్రీంకోర్టులో ఉంది.. పాలనాపరమైన కక్ష సాధింపే ఇది.. అక్కడికి ఇక్కడికి వెళ్లడానికి సిద్ధంగా లేము..’ అని సాల్వే చెప్పారు.
హైకోర్టులో డీటైల్డ్‌గా విచారణ జరపవచ్చు
ఈ సందర్భంగా జస్టిస్ శరణ్.. ఇరుపక్షాలు అంగీకరిస్తే సుప్రీంకోర్టే విచారణ చేపడుతుందని, దాన్నిబట్టి ముందుకెళ్తామని పేర్కొన్నారు. ధావన్ స్పందిస్తూ.. సాల్వే తన వ్యాఖ్యలు తనపైనే (పాలనపరమైన కక్ష సాధింపు) ప్రయోగించడం నచ్చిందన్నారు. సుప్రీంకోర్టులోనే విచారణ జరపాలని ఆదేశించేచోట తాను లేనని, కేసు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, హైకోర్టులో డీటైల్డ్‌గా విచారణ జరపొచ్చని చెప్పారు. ఒకవేళ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆదేశాలివ్వాల్సివస్తే తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని ఆ ఆదేశాల్లో స్పష్టం చేయవచ్చన్నారు. ‘ఎస్సెల్పీ మేం దాఖలు చేశాం.. ఒకవేళ కేసు విచారణ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు చేపడితే అన్ని వాస్తవాలు పరిగణనలోకి తీసుకోవాలి. కానీ వారికి సుప్రీంకోర్టులో విచారణ జరగాలని లేదు’ అని ధావన్ పేర్కొన్నారు. ఒకవేళ ఎస్సెల్పీపైనే అయితే విచారణ చేపట్టాలని, ఎస్సెల్పీని కొట్టివేస్తే అప్పుడు హైకోర్టు విచారిస్తుందని సాల్వే పేర్కొన్నారు.
ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినరోజే న్యాయమూర్తి విచారించారని, ప్రభుత్వ వాదన వినిపించే అవకాశం ఇవ్వలేదని ధావన్ చెప్పారు. న్యాయమూర్తులెవరనే దానిపై చర్చించదలచుకోలేదని, దర్యాప్తు కొనసాగనిస్తే అన్ని వాస్తవాలు బయటపడతాయని పేర్కొన్నారు. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నామని చెప్పారు. ఈ కేసులో ఓ న్యాయమూర్తి పర్యవేక్షణ ఉండాల్సిందేనన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం.. అప్లికేషన్‌ను విచారిస్తామని, కొంత విచారణ తమకూ అవసరమని పేర్కొంది. కేసు విచారణకు వచ్చే వారంలో ఓ తేదీని నిర్ణయిస్తామని తెలిపింది. దర్యాప్తు నిలిచిపోయిందని, హైకోర్టు కూడా విచారణ జరపడం లేదని ధావన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆగస్టులో విచారించాలని ధావన్ కోరారు. అనంతరం తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా వేస్తూ జాబితాలో చివరిగా చేర్చాలని ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది. గతంలో ఈ పిటిషన్‌ను జస్టిస్ అశోక్‌భూషణ్, జస్టిస్ వినీత్‌శరణ్, జస్టిస్ ఎంఆర్‌షాలతో కూడిన ధర్మాసనం విచారించిన విషయం విదితమే.
అమరావతి భూకొనుగోళ్లపై సీబీఐ దర్యాప్తు అవసరం
Published Wed, Jul 14 2021 3:24 AM | Last Updated on Wed, Jul 14 2021 3:32 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment