అమరావతి భూ కుంభకోణం: దర్యాప్తును అడ్డుకోవడం తగదు | Amaravati Land Scam: Supreme Court Bench Adjourned To 19th July | Sakshi
Sakshi News home page

Amaravati Land Scam: దర్యాప్తును అడ్డుకోవడం తగదు

Published Sat, Jul 17 2021 4:12 AM | Last Updated on Sat, Jul 17 2021 9:22 AM

Amaravati Land Scam: Supreme Court Bench Adjourned To 19th July  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దర్యాప్తు ప్రాథమిక దశలో జోక్యం చేసుకోరాదంటూ 1952 నుంచి సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని భూముల కుంభకోణం కేసులో హైకోర్టు స్టే ఇచ్చేసిందని రాష్ట్ర  ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే పేర్కొన్నారు. భారీ కుంభకోణంపై ప్రభుత్వం దర్యాప్తు జరపాలనుకొంటే హైకోర్టు స్టే ఇవ్వడం సబబు కాదన్నారు. సిట్‌ దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చితే రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని, లేదంటే అక్కడితో ముగిసిపోతుందని తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో చాలా విషయాలు ఇమిడి ఉన్నాయని చెప్పారు. రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోళ్లలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదంటూ కొందరిపై సీఐడీ కేసులు కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్‌ వినీత్‌ శరణ్, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం విచారించింది.

‘రాజధాని బహిరంగ రహస్యం అనడంలో తప్పేముంది?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై దుష్యంత్‌ దవే వాదనలు వినిపిస్తూ.. ‘ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఎంపికపై శివరామకృష్ణ కమిటీ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేయాలి. గత ప్రభుత్వం రాజధాని ఏర్పాటు నిమిత్తం కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేసింది. పలు ప్రాంతాలను సబ్‌ కమిటీ సూచించింది. అయితే ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది స్పష్టంగా నిర్ణయించలేదు. అనంతరం సీఆర్‌డీఏ చట్టం వచ్చింది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో 25 గ్రామాలు రాజధాని ఏర్పాటు కోసం సేకరించాలని ప్రకటించారు. ప్రభుత్వంలోని కొందరు, వారి బంధువులు, సంస్థలు రాజధాని ఏర్పాటు కాకుండానే ఆ ప్రాంత బౌండరీల సమీపంలో రైతుల నుంచి భూములు కొనుగోలు చేశారు. ఈ అంశంపై ప్రస్తుతం సిట్‌ దర్యాప్తు ప్రారంభించింది. అంతలో ఈ దర్యాప్తుపై హైకోర్టు స్టే ఇచ్చింది’ అని వివరించారు.

ఇతర కేసులపై ప్రభావం చూపుతోంది
అనంతరం హైకోర్టు తీర్పులో ఏముందంటూ పరిశీలించిన ధర్మాసనం.. ఏ గ్రౌండ్స్‌తో సుప్రీంకోర్టుకు వచ్చారు.. హైకోర్టు దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వలేదు కాబట్టే ఇక్కడకు వచ్చారా? అని ప్రశ్నించింది. ‘రఫీఖ్‌ అహ్మద్‌భాయ్‌ పలివాలా వర్సెస్‌ గుజరాత్‌ కేసులో ప్రాథమిక దశలో ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేయకుండా దర్యాప్తు అధికారి తగిన విధంగా దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశించి ఉండాలని జస్టిస్‌ సప్రే, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పులో పేర్కొంది’ అని దుష్యంత్‌ దవే గుర్తు చేశారు. ‘భూ సేకరణ సమయంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు.

తొలుత బిల్డర్లు రైతుల వద్దకు వెళ్లి మీ భూమి భూసేకరణలో పోతోందని చెప్పి తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత సదరు భూమి భూసేకరణ కాకుండా చూసుకుంటారు. ఈ పద్ధతి చాలా ఏళ్లుగా సాగుతోంద’ని దవే పేర్కొన్నారు. ఈ తరహా అంశంపై జస్టిస్‌ లలిత్‌ ధర్మాసనం క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌కు కూడా ఆదేశించిందని తెలిపారు. ‘అసలు చిక్కు ఏంటంటే ఈ కేసు ఇతర కేసులపై ప్రభావం చూపుతుంది అందుకే వాయిదా వద్దని ప్రతివాదులు కోరుతున్నారు. ఇతర కేసుల్లో కూడా ఆరోపణ ఒక్కటే రాష్ట్ర ప్రభుత్వాన్ని దర్యాప్తు చేయనివ్వడం లేదు. క్రిమినల్‌ ఫిర్యాదుపై ప్రాథమిక దశలో హైకోర్టు అడ్డుకోరాదు’ అని పేర్కొన్నారు. ఇదే కోర్టులో మరో బెంచ్‌ వద్ద ఉన్న ఈ అంశానికి సంబంధించిన కేసుకు దీనిని జత చేయాలని దవే కోరగా, అది సివిల్‌ కేసు అంటూ ధర్మాసనం అంగీకరించలేదు. దవే వాదనలు ఇంకా ఇలా ఉన్నాయి.

తొలుత దర్యాప్తు జరగాల్సిందే..
ఈ కేసును హైకోర్టు నేరుగా క్వాష్‌ చేసింది. ఎలాంటి డైరెక్షన్స్‌ ఇవ్వలేదు. రాజకీయ నేతలు, మరి కొందరు..  రైతులను మోసం చేసి, భూములు కొనుగోలు చేశారు. కొనుగోళ్లు పూర్తయ్యాకే ఆ ప్రాంతంలో రాజధాని వస్తుందని ప్రకటించారు.
పంజాబ్‌ వర్సెస్‌ గురుదయాళ్‌ భూసేకరణ కేసులో కూడా సుప్రీంకోర్టు సీబీఐ దర్యాప్తు చేయాలని పేర్కొంది. రాజకీయ పార్టీల నేతల బంధువులు, కొందరు అధికారులు, వారి వారి సంస్థల పేర్ల మీద రాజధాని ప్రాంతంలో ల్యాండ్‌ పూలింగ్‌ ప్రాంతానికి ఆనుకొని ముందస్తుగా భూములు కొనుగోళ్లు చేస్తే.. అలాంటి ఆరోపణలు దర్యాప్తునకు తగవా.. మీరే చెప్పండి. 
ఆరోపణలపై అధికారులను దర్యాప్తు చేయనివ్వాలి. ఏ పరిస్థితుల్లోనూ జోక్యం తగదని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి. అధికారులు దర్యాప్తు చేసి మెటీరియల్‌ కోర్టు ముందు ఉంచితే, దాన్ని కోర్టు ఎగ్జామిన్‌ చేయాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement