dusyant dave
-
అమరావతి భూ కుంభకోణం: దర్యాప్తును అడ్డుకోవడం తగదు
సాక్షి, న్యూఢిల్లీ : దర్యాప్తు ప్రాథమిక దశలో జోక్యం చేసుకోరాదంటూ 1952 నుంచి సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని భూముల కుంభకోణం కేసులో హైకోర్టు స్టే ఇచ్చేసిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే పేర్కొన్నారు. భారీ కుంభకోణంపై ప్రభుత్వం దర్యాప్తు జరపాలనుకొంటే హైకోర్టు స్టే ఇవ్వడం సబబు కాదన్నారు. సిట్ దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చితే రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని, లేదంటే అక్కడితో ముగిసిపోతుందని తెలిపారు. ఎఫ్ఐఆర్లో చాలా విషయాలు ఇమిడి ఉన్నాయని చెప్పారు. రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోళ్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదంటూ కొందరిపై సీఐడీ కేసులు కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేష్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ‘రాజధాని బహిరంగ రహస్యం అనడంలో తప్పేముంది?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ.. ‘ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఎంపికపై శివరామకృష్ణ కమిటీ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేయాలి. గత ప్రభుత్వం రాజధాని ఏర్పాటు నిమిత్తం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. పలు ప్రాంతాలను సబ్ కమిటీ సూచించింది. అయితే ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది స్పష్టంగా నిర్ణయించలేదు. అనంతరం సీఆర్డీఏ చట్టం వచ్చింది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో 25 గ్రామాలు రాజధాని ఏర్పాటు కోసం సేకరించాలని ప్రకటించారు. ప్రభుత్వంలోని కొందరు, వారి బంధువులు, సంస్థలు రాజధాని ఏర్పాటు కాకుండానే ఆ ప్రాంత బౌండరీల సమీపంలో రైతుల నుంచి భూములు కొనుగోలు చేశారు. ఈ అంశంపై ప్రస్తుతం సిట్ దర్యాప్తు ప్రారంభించింది. అంతలో ఈ దర్యాప్తుపై హైకోర్టు స్టే ఇచ్చింది’ అని వివరించారు. ఇతర కేసులపై ప్రభావం చూపుతోంది అనంతరం హైకోర్టు తీర్పులో ఏముందంటూ పరిశీలించిన ధర్మాసనం.. ఏ గ్రౌండ్స్‌తో సుప్రీంకోర్టుకు వచ్చారు.. హైకోర్టు దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వలేదు కాబట్టే ఇక్కడకు వచ్చారా? అని ప్రశ్నించింది. ‘రఫీఖ్ అహ్మద్భాయ్ పలివాలా వర్సెస్ గుజరాత్ కేసులో ప్రాథమిక దశలో ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయకుండా దర్యాప్తు అధికారి తగిన విధంగా దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశించి ఉండాలని జస్టిస్ సప్రే, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పులో పేర్కొంది’ అని దుష్యంత్ దవే గుర్తు చేశారు. ‘భూ సేకరణ సమయంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. తొలుత బిల్డర్లు రైతుల వద్దకు వెళ్లి మీ భూమి భూసేకరణలో పోతోందని చెప్పి తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత సదరు భూమి భూసేకరణ కాకుండా చూసుకుంటారు. ఈ పద్ధతి చాలా ఏళ్లుగా సాగుతోంద’ని దవే పేర్కొన్నారు. ఈ తరహా అంశంపై జస్టిస్ లలిత్ ధర్మాసనం క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు కూడా ఆదేశించిందని తెలిపారు. ‘అసలు చిక్కు ఏంటంటే ఈ కేసు ఇతర కేసులపై ప్రభావం చూపుతుంది అందుకే వాయిదా వద్దని ప్రతివాదులు కోరుతున్నారు. ఇతర కేసుల్లో కూడా ఆరోపణ ఒక్కటే రాష్ట్ర ప్రభుత్వాన్ని దర్యాప్తు చేయనివ్వడం లేదు. క్రిమినల్ ఫిర్యాదుపై ప్రాథమిక దశలో హైకోర్టు అడ్డుకోరాదు’ అని పేర్కొన్నారు. ఇదే కోర్టులో మరో బెంచ్ వద్ద ఉన్న ఈ అంశానికి సంబంధించిన కేసుకు దీనిని జత చేయాలని దవే కోరగా, అది సివిల్ కేసు అంటూ ధర్మాసనం అంగీకరించలేదు. దవే వాదనలు ఇంకా ఇలా ఉన్నాయి. తొలుత దర్యాప్తు జరగాల్సిందే.. ►ఈ కేసును హైకోర్టు నేరుగా క్వాష్ చేసింది. ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వలేదు. రాజకీయ నేతలు, మరి కొందరు.. రైతులను మోసం చేసి, భూములు కొనుగోలు చేశారు. కొనుగోళ్లు పూర్తయ్యాకే ఆ ప్రాంతంలో రాజధాని వస్తుందని ప్రకటించారు. ►పంజాబ్ వర్సెస్ గురుదయాళ్ భూసేకరణ కేసులో కూడా సుప్రీంకోర్టు సీబీఐ దర్యాప్తు చేయాలని పేర్కొంది. రాజకీయ పార్టీల నేతల బంధువులు, కొందరు అధికారులు, వారి వారి సంస్థల పేర్ల మీద రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ ప్రాంతానికి ఆనుకొని ముందస్తుగా భూములు కొనుగోళ్లు చేస్తే.. అలాంటి ఆరోపణలు దర్యాప్తునకు తగవా.. మీరే చెప్పండి. ►ఆరోపణలపై అధికారులను దర్యాప్తు చేయనివ్వాలి. ఏ పరిస్థితుల్లోనూ జోక్యం తగదని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి. అధికారులు దర్యాప్తు చేసి మెటీరియల్ కోర్టు ముందు ఉంచితే, దాన్ని కోర్టు ఎగ్జామిన్ చేయాలి. -
రాజ్యాంగ లక్ష్యాలను చేరడంలో అంతా విఫలం
సాక్షి, హైదరాబాద్ : మహోన్నతమైన రాజ్యాంగ లక్ష్యాలను, ఆశయాలను సాధించడంలో పాల కులు, రాజకీయ పార్టీలు, విఫలమయ్యాయని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుష్యంత్ దవే అన్నారు.స్వేచ్ఛ,సమానత్వం,సౌభ్రాతృత్వం వంటి ఆశయ సాధనలో అన్ని యంత్రాంగాలు వైఫల్యం చెందాయని ఆందోళన వ్యక్తం చేశారు. పేదరికం,నిరుద్యోగం, నిరక్షరాస్యత ఇంకా పట్టిపీడిస్తూనే ఉన్నాయని చెప్పారు. మంథన్ స్వచ్చంద సంస్థ శుక్రవారం నిర్వహించిన మంథన్ సంవాద్ మూడో ఎడిషన్ కార్యక్రమంలో ఆయన ‘కాన్స్టిట్యూషన్-ది లాస్ట్ రిలీజియన్’అనే అంశంపై మాట్లాడారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి మహనీయుల కృషి ఫలితంగా రూపొందిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం, దాని లక్ష్యాలను సాధించుకొనేందుకు ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించాలని చెప్పారు.దే శంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో మహాత్మాగాంధీ ఉన్నా ఏ మాత్రం సంతృప్తి చెందేవారు కాదన్నారు.ఎంతో సుదీర్ఘమైన మేధోమధనం జరిపి రూపొందించిన ‘రాజ్యాంగం’ ప్రజలకు గొప్ప బహుమతన్నారు.అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని అన్ని మతాల ప్రజలు సమాదరించాలన్నారు.మైనారిటీ ప్రజల భద్రతకు మెజారిటీ ప్రజలు భరోసా ఇవ్వాలని సూచిం చారు. దేశంలో ఇప్పటికీ 50 కోట్ల మంది ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ విలువలు, నైతికతపై అవగాహన లేకపోవడ ం వల్లనే సుపరిపాలన లభించడం లేదన్నారు. నిరక్ష్యరాస్యత, అసమానతలు, పేదరికం తాండవిస్తున్నాయని చెప్పారు. అనేక సామాజిక అంశాలపై లోతైన చర్చలు జరిపేందుకు ‘మంథన్’ వంటి సంస్థలు దోహదం చేస్తాయన్నారు. ఇలాంటి వేదికలు మరిన్ని రావాలని చెప్పారు. ఇది స్టార్టప్ రెవల్యూషన్.... నాస్కామ్ అధ్యక్షుడు ఆర్.చంద్రశేఖర్ ‘స్టార్టప్ రెవల్యూషన్-ఇండియాస్ సిల్వర్ బుల్లెట్’ అనే అంశంపైన ప్రసంగించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అనూహ్యంగా ముందుకు వస్తున్నారని,నిత్యావసర వస్తువుల నుంచి సాఫ్ట్వేర్ రంగం వరకు ఒక విప్లవాత్మకమైన అభివృద్ధిని, మార్పును ప్రస్తుతం చూడగలుగుతున్నామని అన్నారు. ఈ చర్యల వల్ల ఉద్యోగ,ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయని చెప్పారు. ఇప్పుడు ‘స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా’ ప్రధాన నినాదమైందన్నారు. రెండు దశాబ్దాలుగా ఐటీ రంగం అద్భుతమైన పురోగతిని సాధించిందన్నారు. హైదరాబాద్, బెంగళూర్,చెన్నై వంటి నగరాల్లో వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభించాయన్నారు. ప్రముఖ పాత్రికేయుడు హిందోళ్సేన్ గుప్తా మాట్లాడుతూ, దళితుల జీవితాల్లోను మార్పు వచ్చిందని, దళిత ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ప్రగతి బాటలో పయనిస్తున్నారన్నారు.మరో పాత్రికేయ ప్రముఖుడు చంద్రభాన్ ప్రసాద్‌తో కలిసి చేసిన సర్వేలను గురించి ఈ సందర్భంగా వివరించారు. ఉత్తరప్రదేశ్‌లోని అనేక గ్రామాల్లో ఒకప్పుడు సామాజిక వివక్షతను, అణచివేతను ఎదుర్కొన్న దళితులు గౌరవప్రదమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో దళితులకు మరింత ప్రోత్సాహాన్ని అందించి ముందుకు నడిపించవలసిన అవసరముందన్నారు. మహిళలను చూసే దృక్పథం మారాలి ... దేశం అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నప్పటికీ సామాజిక రంగంలో రావలసిన మార్పు ఇంకా రాలేదని, సమాజంలో మహిళలపై హింస,అణచివేత ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ప్రముఖ సామాజిక కార్యకర్త, నృత్యకారిణి మల్లికా సారాభాయి ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక రుగ్మతలా కొనసాగుతున్న స్త్రీపురుష అసమానతలను తొలగించేందుకు మగవారివైపు నుంచే కృషి జరగాలన్నారు. మహిళల పట్ల మగవాళ్ల దృక్పథంలో మార్పు రావాలన్నారు. స్త్రీపురుష సమానత్వాన్ని సాధించేం దుకు పంచవర్ష ప్రణాళికలా ఒక ప్రణాళికను రూపొందించుకొని ఉద్యమస్థాయిలో కృషి చేయవలసి ఉందన్నారు. అంతకుముందు ఆమె గాంధీజీ సిద్ధాంతాల ఆధారంగా మహిళలు ఏవిధంగా సాధికారత సాధించవచ్చో ‘శివక్రాంతి’ అనే నృత్యరూపకం ద్వారా ఆవిష్కరించారు. కర్ణాటక సంగీతగాయకుడు, రచయిత టీఎం కృష్ణ ‘సంస్కృతి, సమాజం, రాజ్యం’ అనే అంశంపై ప్రసంగించారు.