బ్యాంకులో భారీ చోరీ
బ్యాంకులకు భద్రత ఏదీ?
- కలకలం రేపిన ఏపీజీవీబీ దొంగతనం
- ఆందోళనలో ఖాతాదారులు
జడ్చర్ల : ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించి ప్రధాన వనరులుగా ఉన్న బ్యాంకులకే భద్రత కరువైతే ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి బాలానగర్‌లోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ) లో జరిగిన దొంగతనం ఒక్కసారిగా కలకలం రేపింది. ఈ బ్యాంకులో కుదువ పెట్టుకున్న బంగారు నగలకు సంబంధించి 13.5 కిలోల బంగారు నగలను, *15 లక్షలను దొంగలు అపహరించిన ఘటన ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.
పోలీస్ స్టేషన్‌కు అతి సమీపంలో జాతీయ రహదారిని అనుసరించి ఉన్న బ్యాంకులో దొంగతనం చోటుచేసుకోవడం పోలీసులను సైతం కలవరపాటుకు గురిచేసింది. ఇందులో బంగారం కుదువపెట్టి రుణాలు తీసుకున్న ఖాతాదారులు ఆందోళనకు గురయ్యారు. తమ సొమ్ము ఇక చేతికి అందుతుందా లేదోనన్న అనుమానాలు వ్యక్తం చేశారు.
రికార్డులను పరిశీలించి తమ బంగారం తూకం ప్రకారం ఇచ్చినా వాటిని నగలుగా మార్చుకోవడానికి కూడా తయారీ ఖర్చులు భారమవుతాయన్నారు. ఇదిలాఉండగా గత ఏడాది సెప్టెంబర్ 23వ తేదీ రాత్రి జడ్చర్ల మండలం గంగాపూర్‌లోని ఏపీజీవీబీలో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి యత్నించారు. అలాగే బాదేపల్లి ఎస్‌బీహెచ్ ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేసి నగదును ఎత్తుకు వెళ్లేందుకు విఫలయత్నం చేశారు. పోలీసులు విచారణ చేసి సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించి చర్యలు తీసుకున్నారు.
అక్కడక్కడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నా అటు బ్యాంకు అధికారులు గాని, ఇటు పోలీసులుగాని బ్యాంకుల భద్రతపై దృష్టి సారించడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రాత్రివేళ పోలీసులు బ్యాంకుల దగ్గర బందోబస్తు చర్యలు చేపట్టి దొంగతనాలను అరికట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కాలనీలలో, ప్రధాన రహదారులపై గస్తీ పెంచాలన్నారు.
చోరీ అయిన ఆభరణాల విలువ రూ.4 కోట్లు
నిందితులను కఠినంగా శిక్షించాలి : టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
బాలానగర్ : తమ అవసరాల నిమిత్తమో లేక బ్యాంకులో భద్రంగా ఉంటాయన్న ఆలోచనతోనో మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ) లో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎంతో విలువైన తమ బంగారు ఆభరణాలను పెట్టి రుణాలు తీసుకున్నారు. అయితే ఈ బ్యాంకులో దొంగలు పడ్డట్లు తెలియడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. వివరాలు.. బాలానగర్ బస్టాండు కూడలిలో పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఈ బ్యాంకులో ఆదివారం అర్ధరాత్రి దొంగలు చొరబడి 15 లక్షలతో పాటు 13.5 కిలోల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
ఇదిలాఉండగా అక్కడ సెక్యూరిటీ గార్డు గాని, అల్లారం ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ దోపిడీ జరిగిందనే ఆరోపణలున్నాయి. రాత్రివేళలో పెట్రోలింగ్ లేకపోవడమే వల్లే తరచూ దొంగతనాలు జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. బ్యాంకులో మొత్తం 2.4 కోట్ల బంగారు రుణాలు ఇచ్చామని, వాటి విలువ నాలుగు కోట్లకు పైనే ఉంటుందని మేనేజర్ రవికిశోర్‌రెడ్డి తెలిపారు. ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బంగారం సంబంధించిన రికార్డులు భద్రంగానే ఉన్నాయన్నారు. అనంతరం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాల్‌రాజు, శ్రీనివాస్‌గౌడ్ ఈ బ్యాంకును పరిశీలించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు.