పడవలో బిడ్డకు జన్మనిచ్చింది
పలాశ్ గురి: అస్సాం వరదల్లో ఓ మహిళ పడవలో శిశువుకు జన్మనిచ్చింది. బ్రహ్మపుత్ర, ధాన్ సిరి నదులు ఉప్పొంగడంతో కజిరంగా జాతీయ పార్కుకు దగ్గరలో ఉన్న మహిళ గ్రామం బెజగావ్ జల దిగ్భంధంలో చిక్కుకుంది. ఈ సమయంలోనే జ్యోతి రవిదాస్(24)కు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. వేగంగా వస్తున్న నీరు అలల రూపంలో కదులుతూ జ్యోతి బెడ్ రూంలోకి వచ్చేశాయి.
క్రమంగా గదిలోని నీటిమట్టం పెరుగుతూ గర్భాన్ని తాకుతుంటే బిడ్డకు ఏమైనా అవుతుందేమోనని ఆమె పడిన బాధ వర్ణానాతీతం. ఓ వైపు నొప్పులు మరో వైపు వరద నీటి మధ్య చిన్న పడవలో ఆమెను ఆసుపత్రికి చేర్చాడు భర్త జమునా రవిదాస్. ప్రమాదం తప్పిపోయి పండటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది జ్యోతి. ఈ సంఘటన జరిగి వారం రోజులు కావొస్తోంది. ప్రస్తుతం అస్సాం ప్రభుత్వం పలాశ్ గురిలో ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంప్ లో ఉన్న భార్య భర్తలు తమ అనుభవాన్ని పంచుకున్నారు.
వరద కారణంగా తమ ఇల్లు నీటిలో మునిగిపోయిందని భార్యభర్తలు తెలిపారు. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఇంటికి వెళ్లలేకపోయామని, కుటుంబ సంప్రదాయం ప్రకారం బిడ్డ జన్మించిన ఆరో రోజు ప్రత్యేకపూజలు చేయాల్పివుంటుందని చెప్పారు. వరద కారణంగా పూజ చేయలేకపోవడం బాధిస్తోందని చెప్పారు. వరద వచ్చినప్పుడు తన తల్లిదండ్రులు, ఐదేళ్ల కొడుకుని పక్క గ్రామానికి తరలించినట్లు రవిదాస్ వివరించారు. జీవితంలో ఇంతకంటే దారుణమైన పరిస్థితిని ఎదుర్కొనని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కేవలం జ్యోతిరవిదాస్ ల పరిస్థితి కాదు. దాదాపు 300 కుటుంబాలు వరద కారణంగా పలాశ్ గురిలోని ధాన్ సిరిముఖ్ జనతి హైస్కూల్ లో తలదాచుకుంటున్నాయి. ప్రభుత్వం బలవంతంగా చాలా కుటుంబాలను రిలీఫ్ క్యాంపుకు తరలించిందని రవిదాస్ చెప్పారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఇళ్ల నుంచి క్యాంపుకు వచ్చే దారిలో సగం దూరం ఈదుతూ రావాల్సి వచ్చిందని తెలిపారు. క్యాంపులో మనిషికి మూడు రోజులకు మూడు కిలోల బియ్యం ఇస్తున్నట్లు చెప్పారు. వంట చెరకు తడిగా ఉండటంతో అన్నం ఉడికించడం అసాధ్యంగా మారుతుందని వాపోయారు.
వరద కారణంగా చాలా మంది పంట, ఇళ్లను నష్టపోయారు. పలాశ్ గురి చుట్టుపక్కల ప్రాంతాల్లో కలిపి మొత్తం 622 రిలీఫ్ క్యాంపులు, 233 సరఫరా క్యాంపులను ఏర్పాటుచేశారు. మొత్తం 5 లక్షలకు పైగా ప్రజలు క్యాంపుల్లో ఆశ్రయం పొందుతున్నారు. మారుమూల గ్రామాల్లో వేలాదిగా చిక్కుకుపోయిన ప్రజలను రక్షించేందుకు రెస్క్యూ టీమ్ లు ప్రయత్నిస్తున్నాయి. దాదాపు 500లకు పైగా పడవలు ఈ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి.ఆహారం, మందులు, దుస్తులను ప్రజలకు క్యాంపుల ద్వారా నిరంతరం అందిస్తున్నారు.