
వీఆర్‌లో కనువిందు చేయనున్న ‘బాహుబలి-2’
కాకినాడ రూరల్ : త్రీడీ చిత్రాల్లో మన దగ్గరకు చిత్రం వచ్చినట్లు ఉంటుందని, అదే విజువల్ రియాల్టీ (వీఆర్)లో మనమే చిత్రంలోని పాత్రల్లోకి వెళ్లి, వాటి అనుభూతిని పంచుకున్నట్లు ఉంటుందని ‘బాహుబలి-2’ చిత్రం సాంకేతిక నిపుణుడు కరుణాకరన్ చెప్పారు. ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘బాహుబలి–2’ విడుదల కానున్న నేపథ్యంలో ఆ చిత్రం సాంకేతిక బృందం సోమవారం నాగమల్లితోట జంక్షన్ సమీపంలోని లాల్‌బహుద్దూర్ నగర్ మిర్చి రెస్టారెంట్‌లో విజువల్ రియాల్టీ ఎఫెక్ట్స్‌ను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరుణాకరన్ మాట్లాడుతూ చిత్రం ప్రచారంలో భాగంగా ప్రముఖ నగరాల్లో టెక్నికల్ సిబ్బంది ఆధ్వర్యంలో 56 సెకన్లతో కూడిన గ్రాఫిక్స్‌ను ప్రేక్షకులకు చూపిస్తున్నట్లు వివరించారు. మిర్చి రెస్టారెంట్ అధినేత అడ్డూరి రామకృష్ణ భాస్కరరాజు ఆహ్వానం మేరకు కాకినాడలో ఈ ప్రదర్శన జరిపామన్నారు. బాహుబలి-2 చిత్రాన్ని విజువల్ రియాల్టీలో చూడడం ప్రేక్షకులకు కనువిందుగా ఉంటుందన్నారు. చిత్రాన్ని మనం త్రీడీలో కూడా చూసే అవకాశం ఉన్నా దానికన్నా విజువల్ రియాల్టీలో చూసే విధంగా దీన్ని అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించినట్లు వివరించారు. బాహుబలి–2 చిత్రంలో ఉపయోగించిన అత్యాధునికమైన టెక్నాలజీని ప్రతి ఒక్కరికీ చూపించేలా తమ టీం సభ్యులు రాష్ట్రమంతా ప్రముఖ నగరాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా 400 సెంటర్లలో బాహుబలి–2 విడుదల కానున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు విజయవాడ, గాజువాక, విశాఖపట్నం ప్రాంతాల్లో విజువల్ రియాల్టీ ఎఫెక్ట్స్‌ను ప్రదర్శించామని, ఇప్పుడు కాకినాడ, రాజమండ్రిల్లో ప్రదర్శిస్తున్నామని తెలిపారు. జంపన సత్యనారాయణరాజు, సరిపల్లి గంగరాజు, రుద్రరాజు నర్సింహరాజు, అడ్డూరి రామకృష్ణ భాస్కరరాజు ఆనంద్ థియేటర్ యజమాని ప్రదీప్‌రాజు, కృష్ణంరాజు, సాయి, బండారు భాస్కర్, కిట్టు తదితరులు పాల్గొన్నారు.