చుక్కలు చూపిస్తున్న బాస్మతి | basmati rice price increased 65 % in a year | Sakshi
Sakshi News home page

చుక్కలు చూపిస్తున్న బాస్మతి

Published Sat, Nov 30 2013 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM

చుక్కలు చూపిస్తున్న బాస్మతి

చుక్కలు చూపిస్తున్న బాస్మతి

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
 బిర్యానీ రైస్‌గా ప్రాచుర్యంలో ఉన్న బాస్మతి.. సామాన్యుడికి చిక్కనంటోంది. బాస్మతి మరింత విలాస ఉత్పాదన అవుతోంది. కనీవిని ఎరుగని రీతిలో ధర దూసుకెళ్తోంది. ఏడాదిలో ధర 65 శాతం పెరిగిందని కంపెనీలు అంటున్నాయి. డిసెంబరుకల్లా మరో 10 శాతం పెరగొచ్చని అంచనా. అంతర్జాతీయంగా బాస్మతి బియ్యానికి డిమాండ్ పెరుగుతుండడం ఒక ఎత్తై.. రూపాయి విలువ పడిపోవడాన్ని ఎగుమతిదార్లు సొమ్ము చేసుకుంటున్నారు.  దేశీయంగానూ వినియోగం ఎక్కువవుతుండడంతో ధర పెరుగుతూ వస్తోంది.  
 
 ఇంకా విలాసమే..
 మార్కెట్లో సాధారణ బియ్యమే కిలోకు మంచి రకం రూ.50 దాకా పలుకుతోంది. ఇక బాస్మతి బియ్యం వేరేగా చెప్పక్కర లేదు. అత్యధికంగా అమ్ముడవుతున్న పూస బాస్మతి 1121 రకం కొత్త పంట ఏడాది క్రితం ధర కిలోకు రూ.60 మాత్రమే. ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో రూ.100 దాటింది. హైదరాబాద్ రిటైల్ మార్కెట్లో విడి బియ్యం కిలోకు రూ.120 దాకా ఉంది. బ్రాండెడ్ కంపెనీలు కిలో ప్యాక్‌లను రూ.180 వరకు విక్రయిస్తున్నాయి. కొద్ది రోజుల్లో ధర మరో 10 శాతం పెరగొచ్చని కంపెనీలు అంటున్నాయి. బిర్యానీతోపాటు ఇతర వంటకాలకు బాస్మతి వినియోగం పెరుగుతోందని రాడికల్ ఫుడ్స్ సేల్స్, మార్కెటింగ్ సీనియర్ జీఎం ఉదయ్ నాయక్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. అమ్మకాలు ఏటా 30 శాతం వద్ధి చెందుతోందని చెప్పారు. బాస్మతి ఆధారిత రెడీ టు ఈట్, రెడీ టు కుక్ ఉత్పత్తులను ఏడాదిలో ప్రవేశపెడతామన్నారు.
 
 ధర వస్తుండడంతో..
 ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఇరాక్, కువైట్, యూకే, యూఎస్ తదితర దేశాల నుంచి ఆర్డర్లు వెల్లువలా వస్తున్నాయి. దీనికితోడు టన్ను బాస్మతి బియ్యానికి అంతర్జాతీయ మార్కెట్లో 1,800 డాలర్ల దాకా ధర వస్తోందని పరిశ్రమ వర్గాలు సమాచారం. దీంతో బాస్మతి ప్రధానంగా పండే పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ రైతులు ఎగుమతులపై దష్టిపెట్టారు. ఉత్పత్తిలో భారత్ తర్వాతి స్థానంలో ఉన్న పాకిస్తాన్ నుంచి కొన్నేళ్లుగా ఎగుమతులు తగ్గుముఖం పడుతున్నాయి. ఉత్పత్తి వ్యయం పెరగడం, మార్కెటింగ్ బలహీనతలు ఇందుకు కారణం. ఈ అంశాలన్నీ బాస్మతి ధరకు రెక్కలొచ్చేలా చేస్తున్నాయి.
 
 40 లక్షల టన్నులకు..
 గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో 71 లక్షల టన్నుల బాస్మతి పండిందని సమాచారం. 2013-14లో ఇది 90 లక్షల టన్నులకు ఎగబాకొచ్చని అంచనా. ఇక భారత్ నుంచి 2013-14లో బాస్మతి ఎగుమతులు గతేడాదితో పోలిస్తే 11 శాతం వద్ధితో 40 లక్షల టన్నులకు చేరుకోవచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. 2012-13లో దేశం నుంచి రూ.19,390 కోట్ల విలువైన బాస్మతి ఎగుమతులు జరిగాయి. కాగా, దేశీయ వినియోగంలో దక్షిణాది రాష్ట్రాల వాటా 32 శాతం కాగా, ఇందులో ఆంధ్రప్రదేశ్ 18 శాతం కైవసం చేసుకుంది. దేశీయంగా 25 ప్రధాన కంపెనీలు సుమారు రూ.20 వేల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. అసంఘటిత రంగంలో వ్యాపారం రూ.40 వేల కోట్లుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement