పండుగల సందర్భంగా ప్రత్యేకంగా షాపింగ్ చేయడం అనేది చాలామందిలో ఉండే అలవాటు. ఈ సమయంలో అందరినీ ఆకర్షించడానికి వ్యాపార సంస్థలు అనేక ఆకర్షణీయమైన ప్రకటనలతో ఊదరగొడుతుంటాయి. వీటి మోజులో పడి ముందూవెనక ఆలోచించకుండా షాపింగ్ చేశామా... ఆ తర్వాత వాటిని కట్టుకోలేక అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని పద్ధతులు పాటించడం ద్వారా అధిక/అనవసర వ్యయం నుంచి తప్పించుకోవచ్చు.
బడ్జెట్ తయారీ: జీతానికి అనుగుణంగా నెలవారీ ఖర్చుల కోసం ఏ విధంగా బడ్జెట్‌ను తయారు చేసుకుంటామో పండుగల షాపింగ్ కూడా అదే విధంగా తయారు చేసుకోవాలి. షాపింగ్ చేయాల్సిన వస్తువులు ఏంటి?, ఎంత కేటాయించగలరో లెక్కించండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత వీటిలో ఏమైనా అనవసర ఖర్చులున్నాయా, ఏమైనా తగ్గించగలమా అని మరోసారి తిరిగి పరిశీలించండి. ఇలా ప్లాన్ చేసుకోకపోతే షాపింగ్ సమయంలో అనవసర ఖర్చులు పెరిగిపోతాయి.
ఆఫర్స్ పరిశీలించండి: వివిధ కంపెనీలు, సంస్థలు ప్రకటించే ఆఫర్లను పరిశీలించండి. వీటిని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటే బడ్జెట్ తగ్గుతుంది. మనలో చాలామంది ఉచిత ఆఫర్లకు ఎక్కువ ఆకర్షితులవుతారు. రెండు కొంటే మూడోది ఉచితం అని ఉంటే.. ఒకటి కొనాల్సిన చోట ఇంకోటి కొనాల్సి వస్తుంది. దీంతో బడ్జెట్ పెరుగుతుంది. ఆఫర్లు అనేవి బడ్జెట్‌ను తగ్గించేవిగా ఉండాలి కాని పెంచే విధంగా ఉండకూడదు.
: ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ షాపింగ్ ధోరణి బాగా పెరిగింది. నేరుగా షాపింగ్ చేసే దానికంటే ఆన్‌లైన్‌లో తగ్గింపు ధరలకే లభిస్తాయి. వివిధ ఆన్‌లైన్ పోర్టల్స్ అందించే ఆఫర్లను పోల్చి చూసుకొని ఆకర్షణీయంగా ఉన్న ఆఫర్‌ను ఎంచుకోండి. అలాగే ఆన్‌లైన్ షాపింగ్‌లోని ఆఫర్లు, వాటిలోని నిబంధనలను ఒక్కసారి పూర్తిగా చదివాకే కొనం డి. ఆన్‌లైన్‌లో రైల్వే, ఎయిర్ టిక్కెట్లు కొనుగోలు చేస్తే హోటల్స్, ట్యాక్సీలపై కూడా తగ్గింపు ధరలను అందిస్తున్నాయి. ఇలాంటి వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చు.
కార్డుకి దూరంగా: సాధ్యమైనంత వరకు షాపింగ్‌ను నగదుతోనే పూర్తి చేయడానికి ప్రయత్నించండి. క్రెడిట్ కార్డు ద్వారా షాపింగ్ చేయడంవల్ల బడ్జెట్ పరిధి దాటవచ్చు. దీనివల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదముంది.
ఆచితూచి పండుగ షాపింగ్
Published Sun, Oct 27 2013 2:01 AM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM
Advertisement