ఎమ్మెల్యే నీరజ్ కుమార్ సింగ్
పట్నా: బిహార్ బీజేపీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ లాల్‌బాబు ప్రసాద్.. ఆ పార్టీకే చెందిన మహిళా ఎమ్మెల్సీ పట్ల అనుచితంగా ప్రవర్తించిన తీరు దుమారం రేపింది. ఈ విషయం పార్టీ పెద్దల దృష్టికి రావడంతో పార్టీ పదవి నుంచి ప్రసాద్‌ను తొలగించారు.
చతాపూర్ ఎమ్మెల్యే నీరజ్ కుమార్ సింగ్ అలియాస్ బబ్లూ భార్య ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్రసాద్ తనను అభ్యంతరకంగా తాకాడని మహిళా ఎమ్మెల్సీ.. తన భర్త నీరజ్‌కు చెప్పారు. మండలికి వచ్చే దారిలో ప్రసాద్ అనుచితంగా ప్రవర్తించాడని భర్తకు చెప్పారు. దీంతో నీరజ్ ఇతర ఎమ్మెల్సీల సమక్షంలోనే ప్రసాద్‌తో గొడవపడి, చెంప దెబ్బ కొట్టారు. ఈ విషయం బీజేపీ పెద్దల దృష్టికి రావడంతో ప్రసాద్‌పై చర్యలు తీసుకున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీ కమిటీలో ప్రసాద్‌కు స్థానం కల్పించలేదని బిహార్ బీజేపీ చీఫ్ నిత్యానంద్ రాయ్ చెప్పారు. పార్టీ సీనియర్ నాయకులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారని తెలిపారు. మహిళా ఎమ్మెల్సీ నుంచి తమకు లిఖిత పూర్వక ఫిర్యాదు రాలేదని, ఈ ఘటను గురించి విన్న తర్వాత, పార్టీ నాయకులతో చర్చించి, కొత్త కమిటీలో ప్రసాద్ స్థానం కల్పించకూడదని నిర్ణయించినట్టు రాయ్ చెప్పారు. గత కమిటీలో ఆయన కోశాధికారిగా కూడా పనిచేశారు.
ఎమ్మెల్సీ ప్రసాద్ వ్యవహారంపై నీరజ్ భార్య మండలి చైర్‌పర్సన్‌కు కానీ బీజేపీ అధ్యక్షుడికి కానీ ఫిర్యాదు చేయలేదు. నీరజ్ మాట్లాడుతూ.. ఇది చిన్న సమస్యని, తాము పరిష్కరించుకున్నామని చెప్పారు. ఈ ఘటన గురించి ఎవరికీ ఫిర్యాదు చేయబోమని స్పష్టం చేశారు. ఈ ఘటనపై మాట్లాడేందుకు ప్రసాద్ నిరాకరించారు. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తేజస్వి ప్రసాద్ యాదవ్, మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ (లాలు ప్రసాద్ కొడుకులు) ఈ విషయాన్ని ప్రస్తావించడంతో పాటు సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. ఈ ఘటనపై బీజేపీ, మీడియా స్పందించకపోవడాన్ని తేజస్వి తప్పుపట్టారు. ఉత్తరప్రదేశ్‌లో ఈవ్ టీజర్ల భరతం పట్టడానికి బీజేపీ ప్రభుత్వం యాంటీ రోమియో స్వ్కాడ్‌లు ఏర్పాటు చేసిందని, ఆ పార్టీకి చెందిన రోమియోలపై మొదట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే రాజకీయ లబ్ధి కోసం వారు ప్రయత్నిస్తున్నారని నీరజ్ అన్నారు.