Bihar BJP
-
మహిళా ఎమ్మెల్సీని అభ్యంతరకంగా తాకాడని..
పట్నా: బిహార్ బీజేపీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ లాల్‌బాబు ప్రసాద్.. ఆ పార్టీకే చెందిన మహిళా ఎమ్మెల్సీ పట్ల అనుచితంగా ప్రవర్తించిన తీరు దుమారం రేపింది. ఈ విషయం పార్టీ పెద్దల దృష్టికి రావడంతో పార్టీ పదవి నుంచి ప్రసాద్‌ను తొలగించారు. చతాపూర్ ఎమ్మెల్యే నీరజ్ కుమార్ సింగ్ అలియాస్ బబ్లూ భార్య ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్రసాద్ తనను అభ్యంతరకంగా తాకాడని మహిళా ఎమ్మెల్సీ.. తన భర్త నీరజ్‌కు చెప్పారు. మండలికి వచ్చే దారిలో ప్రసాద్ అనుచితంగా ప్రవర్తించాడని భర్తకు చెప్పారు. దీంతో నీరజ్ ఇతర ఎమ్మెల్సీల సమక్షంలోనే ప్రసాద్‌తో గొడవపడి, చెంప దెబ్బ కొట్టారు. ఈ విషయం బీజేపీ పెద్దల దృష్టికి రావడంతో ప్రసాద్‌పై చర్యలు తీసుకున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీ కమిటీలో ప్రసాద్‌కు స్థానం కల్పించలేదని బిహార్ బీజేపీ చీఫ్ నిత్యానంద్ రాయ్ చెప్పారు. పార్టీ సీనియర్ నాయకులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారని తెలిపారు. మహిళా ఎమ్మెల్సీ నుంచి తమకు లిఖిత పూర్వక ఫిర్యాదు రాలేదని, ఈ ఘటను గురించి విన్న తర్వాత, పార్టీ నాయకులతో చర్చించి, కొత్త కమిటీలో ప్రసాద్ స్థానం కల్పించకూడదని నిర్ణయించినట్టు రాయ్ చెప్పారు. గత కమిటీలో ఆయన కోశాధికారిగా కూడా పనిచేశారు. ఎమ్మెల్సీ ప్రసాద్ వ్యవహారంపై నీరజ్ భార్య మండలి చైర్‌పర్సన్‌కు కానీ బీజేపీ అధ్యక్షుడికి కానీ ఫిర్యాదు చేయలేదు. నీరజ్ మాట్లాడుతూ.. ఇది చిన్న సమస్యని, తాము పరిష్కరించుకున్నామని చెప్పారు. ఈ ఘటన గురించి ఎవరికీ ఫిర్యాదు చేయబోమని స్పష్టం చేశారు. ఈ ఘటనపై మాట్లాడేందుకు ప్రసాద్ నిరాకరించారు. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తేజస్వి ప్రసాద్ యాదవ్, మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ (లాలు ప్రసాద్ కొడుకులు) ఈ విషయాన్ని ప్రస్తావించడంతో పాటు సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. ఈ ఘటనపై బీజేపీ, మీడియా స్పందించకపోవడాన్ని తేజస్వి తప్పుపట్టారు. ఉత్తరప్రదేశ్‌లో ఈవ్ టీజర్ల భరతం పట్టడానికి బీజేపీ ప్రభుత్వం యాంటీ రోమియో స్వ్కాడ్లు ఏర్పాటు చేసిందని, ఆ పార్టీకి చెందిన రోమియోలపై మొదట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే రాజకీయ లబ్ధి కోసం వారు ప్రయత్నిస్తున్నారని నీరజ్ అన్నారు. -
9 కోట్లు ఇచ్చారు.. ఆ మనిషి ఏడి?
ముఖ్యమంత్రి సలహాదారు పదవిలో నియమించి.. రూ. 9 కోట్లు చెల్లిస్తే, ఇప్పుడు ఆ మనిషి ఏమైపోయాడని బిహార్ బీజేపీ నేతలు ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ను ప్రశ్నిస్తున్నారు. బిహార్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత కిషోర్ (39)ని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో తమ ఎన్నికల వ్యూహకర్తగా నియమించిన విషయం తెలిసిందే. 1989లో యూపీలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్.. ఈ 27 ఏళ్ల నుంచి అధికారం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూనే ఉంది. బిహార్ రాష్ట్రానికి 2025 విజన్ డాక్యుమెంటు తయారుచేయడం కోసం ప్రశాంత కిషోర్‌కు నితీష్ సర్కారు రూ. 9.31 కోట్లు చెల్లించిందని బీజేపీ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ అన్నారు. కానీ ఆయన ఈ పని వదిలిపెట్టి.. యూపీలో కాంగ్రెస్ పని చూస్తున్నందున వెంటనే ముఖ్యమంత్రి సలహాదారు పదవి నుంచి ఆయనను తప్పించాలని డిమాండ్ చేశారు. సీఎం సలహాదారు హోదాలో బిహార్ వికాస్ మిషన్ సభ్యుడిగా కూడా ఉన్న కిశోర్.. మే 31న జరిగిన సమావేశానికి హాజరు కాలేదు. జనవరిలో సీఎం సలహాదారుగా నియమితుడైన తర్వాత బిహార్‌కు మహా అయితే ఒకటి రెండు సార్లు మాత్రమే వచ్చారు. -
బీజేపీలో చేరిన ఆదిత్య వర్మ
న్యూఢిల్లీ: గుర్తింపులేని బీహార్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఆదిత్య వర్మ గురువారం బీజేపీలో చేరారు. ఆయనను బీహార్ బీజేపీ అధ్యక్షుడు మంగల్ పాండే సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ పై కేసు వేసి ఆయన వార్తల్లో నిలిచారు. ఎన్. శ్రీనివాసన్- బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడానికి వర్మ కారణమయ్యారు. వర్మ పిటిషన్ వేయడంతో స్పాట్ ఫిక్సింగ్ పై దర్యాప్తుకు సుప్రీంకోర్టు జస్టిస్ ముగ్దల్ కమిటీ వేసింది. విచారణ పూర్తయ్యే వరకు బీసీసీఐ అధ్యక్ష పదవికి దూరంగా ఉండాలని శ్రీనివాసన్ ను కోర్టు ఆదేశించింది. శ్రీనివాసన్ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలి చైర్మన్‌గా ఉన్నారు.