బీఎస్‌ఎన్‌ఎల్ రోమింగ్ మరింత చౌక
కోల్‌కతా: ప్రభుత్వ రంగ టెలికం ఆపరేటర్ బీఎస్‌ఎన్‌ఎల్ రోమింగ్ చార్జీలను 40 శాతం వరకూ తగ్గించింది. మే 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు ఈ మేరకు వెలువడిన ఒక ప్రకటన తెలిపింది. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మొబైల్ కనెక్షన్లు అన్నింటికీ ఈ తగ్గింపు వర్తిస్తుంది. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ జారీచేసిన టెలికం టారిఫ్ ఉత్తర్వు నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్‌కమింగ్ కాల్స్‌కు రోమింగ్ టారిఫ్ 40 శాతం తగ్గింది. ఎస్‌టీడీకి సంబంధించి 23 శాతం, లోకల్ కాల్స్ విషయంలో 20 శాతం రోమింగ్ చార్జీలు తగ్గాయి. ఇక లోకల్ నేషనల్ ఎస్‌ఎంఎస్ టారిఫ్‌లు 75 శాతం తగ్గాయి. రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటల వరకూ ల్యాండ్‌లైన్ నుంచి ల్యాండ్‌లైన్‌కు ఉచిత అపరిమిత కాల్స్ నిర్ణయాన్ని మే 1 నుంచి బీఎస్‌ఎన్‌ఎల్ అమలు చేస్తోంది. ట్రాయ్ గరిష్ట టారిఫ్ ధరలను తగ్గించటంతో పలు టెలికం కంపెనీలు రోమింగ్ మొబైల్ కాల్స్, ఎస్‌ఎంఎస్ ధరలను 40 శాతం, 75 శాతం వరకూ తగ్గించాయి.