
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో పూర్తిస్థాయి ఆంక్షల సడలింపు దిశగా మరో కీలక ముందడుగు పడింది. సోమవారం నుంచి కశ్మీర్‌లో పోస్ట్ పేయిడ్ మొబైల్ సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జమ్మూకశ్మీర్ యంత్రాంగం శనివారం కీలక ప్రటకన చేసింది. సోమవారం మధ్యాహ్నం నుంచి పోస్ట్ పెయిడ్ మొబైల్ సేవలు ప్రారంభమవుతాయని, దీంతో రాష్ట్రంలో 99శాతం ఆంక్షలు ఎత్తివేసినట్టు అవుతుందని రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ ప్రధాన సెక్రటరీ రోహిత్ కన్సాల్ తెలిపారు. నిజానికి శనివారం నుంచే పోస్ట్ పేయిడ్ మొబైల్ సేవలు ప్రారంభం కావాల్సి ఉండగా చివరినిమిషంలో తలెత్తిన సాంకేతిక సమస్యల వల్ల సోమవారానికి వాయిదా వేశారు.
ఇక, ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణకు మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఆందోళనలు చెలరేగకుండా కేంద్రం జమ్మూకశ్మీర్‌లో పెద్ద ఎత్తున ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇంటర్నెట్, మొబైల్ సేవలను కూడా ప్రభుత్వం నిలిపివేసింది. అయితే, కశ్మీర్‌లో పరిస్థితులు క్రమంగా కుదుటపడుతుండటంతో దాదాపు 90శాతం ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తూ వచ్చింది. దీంతో కశ్మీర్‌లో పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment