సమయ నిర్ధారణ సాధ్యం కాదు | Can not possible of Time confirmation | Sakshi
Sakshi News home page

సమయ నిర్ధారణ సాధ్యం కాదు

Published Thu, Dec 10 2015 4:32 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 PM

సమయ నిర్ధారణ సాధ్యం కాదు

సమయ నిర్ధారణ సాధ్యం కాదు

సాక్షి, న్యూఢిల్లీ: కాజీపేటలో రైల్వే వ్యాగన్ల తయారీ కర్మాగారాన్ని ప్రారంభించడానికి సమయ నిర్ధారణ చేయడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బుధవారం లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా ఈమేరకు రాతపూర్వక జవాబిచ్చారు.  2011-12లోనే రెల్వే వ్యాగన్ల ఫ్యాక్టరీని కేంద్రం మంజూరు చేసిందని, అయితే రవాణా అవసరాలను బట్టే ఈ కర్మాగారం ప్రారంభించడానికి సమయ నిర్ధారణ జరుగుతుందన్నారు.

ప్రస్తుత అవసరాల మేరకు తగినన్ని వ్యాగన్లను ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని కర్మాగారాలు తయారు చేస్తున్నందు వల్ల కాజీపేట కర్మాగారం పనులను ప్రారంభించలేదని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు రూ.152.26 కోట్లు గతంలో కేటాయించినప్పటికీ, 2014 మార్చి వరకూ వ్యయం కాలేదని, అయితే భవిష్యత్తులో రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టు రద్దు కాకుండా 2015-16లో నామమాత్రపు కేటాయింపు జరిగినట్లు తెలిపారు.
 
యూపీఎస్సీ నిపుణుల కమిటీ
యూపీఎస్సీ పరీక్షల నిర్వహణకు సంబంధించిన అర్హత, సిలబస్, పరీక్ష విధానం తదితర అంశాలను పరీక్షించడానికి బీఎస్ బాస్వాన్ అధ్యక్షతన నిపుణుల కమిటీ ఏర్పాటైందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీ కవిత అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ, కమిటీ ఆరు నెలల వ్యవధిలో నివేదిక ఇస్తుందని చెప్పారు.
 
మైనారిటీల స్థితిగతులపై...
దేశంలోని మైనారిటీల స్థితిగతులను అధ్యయనం చేయడానికి కొత్తగా కమిషన్ ఏర్పాటు చేసే ప్రతిపాదనేదీ లేదని కేంద్రం స్పష్టంచేసింది. లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీ కొత్తా ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ, ఓబీసీలకు చెందిన 27 శాతం రిజర్వేషన్లలో సబ్‌కోటాగా మైనారిటీలకు 4.5 శాతాన్ని కేంద్రం కేటాయించిందని, అయితే దీన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసిందన్నారు. ప్రస్తుతం ఈ విషయం సుప్రీంకోర్టు విచారణలో ఉందని చెప్పారు.
 
ఏపీ రాజధానికి విదేశీ సాయం కోరలేదు
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అభివృద్ధి కోసం రైల్వే నెట్‌వర్క్‌ను విస్తరించడానికి ఏ దేశంతోనూ ఒప్పందం కుదుర్చుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది. టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ, ఏపీలో ప్రస్తుతం 17 నూతన రైల్వే లైన్లు, 14 డబ్లింగ్ పనులు సాగుతున్నాయని రైల్వే సహాయ మంత్రి మనోజ్ సిన్హా చెప్పారు.

గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు పెరిగాయని, 2014-15లో రూ.1,027 కోట్లు కేటాయించగా, 2015-16లో రూ.2,554 కోట్లు కేటాయించారన్నారు. నూతన రాజధాని, దాని పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న రవా ణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని విజయవాడ-నర్సాపూర్ డబ్లింగ్ పనులు, విజయవాడ- కాజీపేట మూడోలైను, విజయవాడ బైపాస్, విజయవాడ-గూడూర్ మూడో లైనును చేపట్టామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement