కెనరా స్మార్ట్ ఫ్యూచర్ ప్లాన్
కెనరా హెచ్‌ఎస్‌బీసీ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘స్మార్ట్ ఫ్యూచర్ ప్లాన్’ పేరుతో యులిప్ పథకాన్ని ప్రవేశపెట్టింది. పాలసీదారుల రిస్క్ సామర్థ్యాన్ని బట్టి ఇన్వెస్ట్ చేయడానికి 5 రకాల ఫండ్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. పరిమిత కాలానికి ప్రీమియం చెల్లించే వెసులుబాటు, పాలసీ కాలపరిమితి మధ్యలో అవసరాలకు అనుగుణంగా కొంత మొత్తం వెనక్కి తీసుకునే అవకాశాన్ని ఈ పథకం అందిస్తోంది. పిల్లల భవిష్యత్తు ఆర్థిక అవసరాలకు అక్కరకు వచ్చే విధంగా ఈ పథకాన్ని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.
పీర్‌లెస్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్
పీర్‌లెస్ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీం (ఈఎల్‌ఎస్‌ఎస్- ట్యాక్స్ సేవింగ్)ను ప్రవేశపెట్టింది. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై గరిష్టంగా రూ. 1.50 లక్షలు ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం మినహాయింపులు పొందవచ్చు. మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటే ఈ పథకం న్యూ ఫండ్ ఆఫర్ డిసెంబర్ 21తో ముగుస్తుంది. కనీస ఇన్వెస్ట్‌మెంట్ విలువను రూ. 500గా నిర్ణయించారు.
అంతా ఆన్‌లైన్‌లోనే
ఫ్యూచర్ జెనరాలీ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీదారుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్ని పాలసీల వివరాలను ఒకే చోట చూసుకునే వెసులుబాటుతో పాటు, తర్వాత చెల్లించాల్సిన ప్రీమియంలు, యులిప్ టాప్ అప్స్ అన్నీ ఆన్‌లైన్ ద్వారానే చేసుకోవచ్చు. అలాగే పాలసీదారుల వ్యక్తిగత వివరాలు, పాన్‌కార్డు, నామినీ వివరాలను ఆన్‌లైన్‌లోనే మార్చుకోవచ్చు. పాలసీదారులకు సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఆన్‌లైన్ పోర్టల్‌న్ అభివృద్ధి చేసినట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
యాప్‌తో విదేశాల నుంచి డబ్బులు
సామాజిక వైబ్‌సైట్ల ద్వారా విదేశాల నుంచి నగదు బదిలీ సేవలను ఎక్స్‌ప్రెస్ మనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ జోపో’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ యాప్ ద్వారా వాట్సప్, ఫేస్‌బుక్, ట్వీట్టర్, వుయ్‌చాట్ వంటి సామాజిక వెబ్‌సైట్స్ ద్వారా విదేశాల నుంచి నగదును సులభంగా పొందవచ్చు. ఇందుకోసం ఫాస్ట్‌క్యాష్‌తో ఎక్స్‌ప్రెస్ మనీ ఒక ఒప్పందం కుదుర్చుకుంది.
హెచ్‌డీఎఫ్‌సీ ఇండెక్స్ ఈటీఎఫ్
హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ సంస్థ సెన్సెక్స్, నిఫ్టీ ఈటీఎఫ్‌లను ప్రవేశపెట్టింది. నిఫ్టీ ఈటీఎఫ్‌ను ఎంచుకుంటే నిఫ్టీకి చెందిన 50 కంపెనీల్లో, అదే సెన్సెక్స్ ఈటీఎఫ్ ఎంచుకుంటే సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. వీటి రాబడులు ఇండెక్స్ రాబడులకు ఇంచుమించు సమానంగా ఉంటాయి. నవంబర్ 30న ప్రారంభమయ్యే న్యూ ఫండ్ ఆఫర్ డిసెంబర్ 2తో ముగుస్తుంది. కనీస ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం రూ. 5,000. చిన్న మొత్తంతో నేరుగా లార్జ్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఇవి అనువుగా ఉంటాయి.
బ్రీఫ్స్..
Published Mon, Nov 30 2015 12:32 AM | Last Updated on Tue, Aug 27 2019 4:29 PM
Advertisement
Advertisement