కార్లకు, చిన్న వాహనాలకు టోల్ టాక్స్ రద్దు!
అహ్మదాబాద్ : కార్లు, చిన్న చిన్న వాహనదారులకు స్వాతంత్ర్య దినోత్సవ కానుక. ఆగస్టు 15 నుంచి ఈ వాహనదారులు టోల్ టాక్స్ ను చెల్లించాల్సినవసరం లేదట. అయితే ఈ కానుక ఏ రాష్ట్రంలో అనుకుంటున్నారా..! ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఈ కానుకను ఎంజాయ్ చేయొచ్చట. వచ్చే ఏడాది గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. వాల్సాడ్ జిల్లాలో 67వ వాన్ మహోత్సవ ఫంక్షన్ సందర్భంగా ఆమ్రా వాన్ ఆవిష్కరణోత్సవ స్పీచ్ లో ఆమె ఈ విషయాన్ని తెలిపారు.
ఆగస్టు 15 నుంచి కార్లు, చిన్న వాహనాలను టోల్ టాక్స్ చెల్లింపు పరిధి నుంచి మినహాయిస్తున్నామని వెల్లడించారు. కమర్షియల్,పెద్ద వాహనాలకు టోల్ టాక్స్ అలాగే కొనసాగుతుందని పేర్కొన్నారు. మధ్యతరగతికి చెందిన సోదరీ, సోదరులు ఇక నుంచి పనిచేయడానికి వారి కార్లలో బయటికి వెళ్లొచ్చని ప్రకటించారు. ఈ మినహాయింపు ఖర్చును గుజరాత్ రాష్ట్రం భరిస్తుందని పేర్కొన్నారు. అయితే జాతీయ రహదారులపై ఉన్న టోల్ బూత్స్ కు ఈ నిర్ణయం వర్తించదని, అవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రావని వెల్లడించారు.