తుపాకి చూపిస్తే క్యాషియర్ రియాక్షన్ ఇదా..!
అమెరికాలో గన్ కల్చర్ బాగా ఎక్కువ. సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకుల వద్దకు వెళ్లి తుపాకులు చూపించి బెదిరించి డబ్బు వసూలు చేయడం మనకు తెలిసిందే. అలా ఎవరైనా వచ్చి ఉన్నట్టుండి తుపాకి చూపించగానే మన రియాక్షన్ ఎలా ఉంటుంది? భంయతో వణికిపోతాం కదూ. వీలైతే అరుస్తాం, దుండగుడిని భయపెట్టడానికి కూడా ఎంతో కొంత ప్రయత్నిస్తాం. కానీ, కాన్సాస్‌లో ఓ క్యాషియర్ మాత్రం అలా ఏమీ చేయలేదు. మరి తుపాకి చూపించి బెదిరించిన నిందితుడి విషయంలో అతడేం చేశాడో తెలుసా..
కాన్సాస్‌లోని జిమ్మీ జాన్స్ రెస్టారెంటుకు ఓ కస్టమర్ వచ్చాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడిన తర్వాత జేబులోంచి గన్ తీశాడు. దగ్గరున్న డబ్బులన్నీ ఇవ్వమని బెదిరించాడు. కానీ అక్కడున్న క్యాషియర్ ఏమాత్రం భయపడలేదు, కంగారు కూడా పడలేదు. తాపీగా వచ్చి ముందు చేతులకు ఉన్న గ్లోవ్స్ తీసేశాడు. చాలా కూల్‌గా క్యాష్ రిజిస్టర్ తెరిచి, అందులో ఉన్న నోట్లన్నింటినీ ఒక్కోటీ తీసి ఆ దుండగుడికి ఇచ్చాడు. అంతేకాదు, సూపర్ బజార్లలో డబ్బులు పెట్టే క్యాష్ రిజిస్టర్‌ను కూడా తీసి అతడి చేతిలో పెట్టాడు. దాంతో బిత్తరపోయిన దుండగుడు.. డబ్బులు మాత్రం తీసుకుని ఆ డబ్బాను పక్కన పెట్టి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజిని కాన్సాస్ పోలీసులు యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోకు ఇప్పటికే పది లక్షలకు పైగా వ్యూలు వచ్చాయి.
నిందితుడిని పట్టుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దానిమీద కామెంట్లు కూడా విపరీతంగా వచ్చాయి. ఆ క్యాషియర్ ఎంత సిన్సియర్.. క్యాష్ వద్దకు వెళ్లే ముందు గ్లోవ్స్ కూడా తీసేశాడంటూ మెచ్చుకున్నారు. డిక్షనరీ తీసి అందులో 'ఇంపెర్చూర్బబుల్' అనే పదానికి అర్థం వెతికితే అక్కడ ఈ క్యాషియర్ ముఖం కనిపిస్తుందని మరో వ్యక్తి చెప్పారు. ఇప్పటికే ఒకటి రెండు సార్లు అతడికి అలా అయి ఉంటుందని, అందుకే ఈసారి అలవాటు పడిపోయి ఉంటాడని మరికొందరు వ్యాఖ్యానించారు. మొత్తం డ్రాయర్ అంతా తీసేసి ఇచ్చేయడం చూస్తే మాత్రం నవ్వు ఆపుకోలేకపోయామని ఇంకొందరు చెప్పారు.