ఎఫ్‌డీఐల పెంపునకు మరిన్ని చర్యలు
ఎన్‌ఆర్‌ఐలు, తయారీ సంస్థలకు నిబంధనల సడలింపు!
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను మరింతగా ఆకర్షించడంపై మోదీ సర్కారు దృష్టిసారించింది. దీనిలో భాగంగా తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను ఈ-కామర్స్ పోర్టల్స్ ద్వారా విక్రయించుకునేందుకు అనుమతించడంతో పాటు ప్రవాస భారతీయుల(ఎన్‌ఆర్‌ఐ)కు సంబంధించి ఎఫ్‌డీఐ నిబంధనలను సరళీకరించడం వంటి పలు చర్యలపై కసరత్తు జరుగుతోంది. మరోపక్క, విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్‌ఐపీబీ) ఆమోదించే పెట్టుబడి పరిమితిని ఇప్పుడున్న రూ.1,200 కోట్ల నుంచి రూ.3,000 కోట్లకు పెంచాలని కూడా వాణిజ్య-పరిశ్రమల శాఖ ప్రతిపాదించింది.
వివిధ రంగాల్లో ఎఫ్‌డీఐలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐ), ఇతరత్రా సాధనాల ద్వారా జరిపే పెట్టుబడులన్నింటికీ కలిపి ఒకే పరిమితి(కాంపొజిట్ క్యాప్)ని ప్రవేశపెట్టాలని కూడా కోరింది. రక్షణ, రైల్వేలు, వైద్య పరికరాలు, నిర్మాణ రంగంలో ఎఫ్‌డీఐ నిబంధనలను ప్రభుత్వం సడలించిన సంగతి తెలిసిందే. కాగా, 2014-15 ఏడాది ఏప్రిల్-జనవరి కాలంలో భారత్‌లో ఎఫ్‌డీఐలు 36 శాతం వృద్ధితో 25.52 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇదిలాఉండగా... వచ్చే నెల 9న జరగనున్న సమావేశంలో దాదాపు 32 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలపై ఎఫ్‌ఐపీబీ నిర్ణయం తీసుకోనుంది.