33 సార్లు...చార్జిషీట్‌లో చంద్రబాబు! | Chandrababu 33 times in charge sheet | Sakshi
Sakshi News home page

33 సార్లు...చార్జిషీట్‌లో చంద్రబాబు!

Published Tue, Aug 30 2016 12:14 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

33 సార్లు...చార్జిషీట్‌లో చంద్రబాబు! - Sakshi

33 సార్లు...చార్జిషీట్‌లో చంద్రబాబు!

- ‘ఓటుకు కోట్లు’ వ్యవహారమంతా బాబు కనుసన్నల్లోనే
- ఏసీబీ చార్జిషీట్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర బట్టబయలు
- ‘బ్రీఫ్‌డ్ మీ’ చంద్రబాబు గొంతే..
- కోర్టుకు గతేడాది స్పష్టం చేసిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ

 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీ స్థానం కోసం ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిపిన వ్యవహారమంతా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కనుసన్నల్లోనే జరిగిందని అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) చార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఈ మేరకు న్యాయస్థానానికి గతేడాది ఆగస్టులో ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో వివరించింది. ఏపీ సీఎం చంద్రబాబు పేరును చార్జిషీట్‌లో దాదాపు 33 సార్లు ప్రస్తావించింది. అంతేకాదు ఈ కుట్రకు ఎలాంటి వ్యూహం రచించింది... ఎవరెవరు పాత్రధారులు, సూత్రధారులనే విషయాన్ని స్పష్టం చేసింది.

చంద్రబాబు కనుసన్నల్లోనే ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్, రుద్ర ఉదయ్‌సింహ, జెరూసలెం మత్తయ్యలతో పాటు మిగతా వారందరూ కుట్రకు పురుడుపోశారని పేర్కొంది. రూ.150 కోట్ల కుంభకోణం కుట్ర, ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబంధించి న్యాయస్థానానికి అందించిన నివేదికలో ఏసీబీ పూసగుచ్చినట్లు వివరించింది. దాదాపు 25 పేజీలతో కూడిన నివేదికను న్యాయస్థానానికి ఏసీబీ అందజేసింది. అసలు కుట్ర మొత్తం ఒకరిద్దరు మాత్రమే చేసింది కాదని... ఇది పూర్తిగా వ్యవస్థీకృత నేరమని స్పష్టం చేసింది. వ్యవహారమంతా ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కేంద్రంగా నడించిందని వెల్లడించింది.

పదే పదే చంద్రబాబు పేరు..
న్యాయస్థానంలో ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో పదే పదే ఏపీ సీఎం చంద్రబాబు పేరును ప్రస్తావించింది. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్‌ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను పేర్కొంది. ఎమ్మెల్సీ స్థానాన్ని కచ్చితంగా కైవసం చేసుకోవాలని, ఇందుకు సార్(చంద్రబాబు) గట్టి పట్టుదలతో ఉన్నట్లు.. ఫోన్‌లో సెబాస్టియన్‌తో ఎమ్మెల్యే సండ్ర పేర్కొన్నారని వివరించింది. కుట్రకు పురుడు పోసుకున్న సమయంలో టీడీపీ మహానాడుకు ఏర్పాట్లు జరుగుతున్నా... వాటికన్నా ‘కొనుగోలు’ వ్యవహారమే ముఖ్యమని దిశానిర్దేశం చేశారని తెలిపింది.

అంతేకాదు ఎమ్మెల్యేల కొనుగోలులో నాలుగు ఆప్షన్స్ ఇచ్చినట్లు స్టీఫెన్‌సన్‌తో జరిపిన ఫోన్ సంభాషణలో వెలుగు చూసినట్లు పేర్కొంది. ‘‘తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చా.  అండగా ఉంటాం. మీకు ఏం కావాలన్నా నేరుగా చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్తాం. ఏపీలో మా ప్రభుత్వమే ఉంది. కేంద్రంలో మా మిత్రపక్షం బీజేపీనే అధికారంలో ఉంది. ఎక్కడ నామినేటెడ్ పోస్టు కావాలన్నా ఇప్పిస్తాం’’ అంటూ ప్రలోభాలకు గురిచేసినట్లు తెలిపింది. ప్రలోభాల కోసం నాలుగైదు బృందాలు పనిచేశాయని పేర్కొంది. వారందరూ కూడా చంద్రబాబు సలహాలు, సూచనల మేరకు వ్యవహరించారంది.

ఎన్టీఆర్ భవన్ కేంద్రంగానే కుట్ర...
ఓటుకు కోట్లు కుంభకోణం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కేంద్రంగానే జరిగినట్లు ఏసీబీ పేర్కొంది. ఈమేరకు ఎమ్మెల్యే సండ్ర రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.  కీలక భేటీలన్నీ కూడా పార్టీ కార్యాలయంలోనే జరిగాయని వివరించింది. అంతేకాదు కుట్రను అత్యంత పకడ్బందీగా నిర్వహించారని, అందుకు డ్రైవర్ల ఎంపికలోనే అనేక కీలక జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపింది. మూడు, నాలుగు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి కుట్రకు నాంది పలికారు. అంతేకాదు ప్లాన్‌ను ఎప్పటికప్పుడు బృంద సభ్యులందరూ ఎస్‌ఎంఎస్‌ల ద్వారా పాలుపంచుకున్నారు. అంతా పూర్తి చేశాకనే ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని రంగంలోకి దింపినట్లు ఏసీబీ పేర్కొంది.
 
అది బాబు గొంతే..
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడిన ఫోన్ సంభాషణలు నిజమైనవేనని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) నివేదిక ద్వారా తేటతెల్లమైంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్ సంభాషణలు బైటపడిన విషయం తెలిసిందే. స్టీఫెన్‌సన్ ఫోన్‌లో రికార్డయిన కాల్ వాయిస్‌ను స్వాధీనం చేసుకున్న ఏసీబీ... న్యాయస్థానం ద్వారా ఎఫ్‌ఎస్‌ఎల్‌కు అందజేసింది. వాయిస్ వాస్తవమైనదా..? లేదా అనేది నిర్ధారించాల్సిందిగా ఎఫ్‌ఎస్‌ఎల్‌ను కోర్టు ఆదేశించింది.ఆ మేరకు ఫోన్ సంభాషణలన్నింటినీ ఎఫ్‌ఎస్‌ఎల్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్ధారించింది. ఫోన్‌లో నమోదైన రికార్డు వాయిస్ మొత్తం వాస్తవమైనదేనని నిర్ధారించింది. ఈ మేరకు గతేడాది ఆగస్టులో న్యాయస్థానానికి నివేదిక కూడా అందజేసింది. అంతేకాదు ఆ వాయిస్ పూర్తిగా వాస్తవమైనదేనని, అందులో ఎలాంటి ‘కట్-కాపీ-పేస్టులు’లు లేవని, అంతా ఏకమొత్తం నిడివి కలిగినదేనని వివరించింది.
 
చంద్రబాబు ఫోన్ సంభాషణ
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు సాగించిన ఫోన్ సంభాషణ..
 హా చంద్రబాబు అనుచరుడు: హలో.. యా బ్రదర్.. బాబుగారు గోయింగ్ టు టాక్ టు యూ.. బి అన్ ద లైన్  (హలో బ్రదర్, బాబు గారు మీతో మాట్లాడతారు. లైన్‌లో ఉండండి)
స్టీఫెన్‌సన్: యా..
చంద్రబాబు: హలో..
స్టీఫెన్‌సన్: సార్..సార్.. గుడ్ ఈవెనింగ్ సార్..
చంద్రబాబు: గుడ్ ఈవెనింగ్  బ్రదర్.. హౌ ఆర్ యూ(మీరు ఎలా ఉన్నారు..?)
స్టీఫెన్‌సన్: ఫైన్.. థాంక్యూ సర్
చంద్రబాబు: మన వాళ్లు బ్రీఫ్డ్ మి.. ఐయామ్ విత్ యూ.. డోంట్ బాదర్ (మనవాళ్లు నాకు అంతా వివరించారు. మీకు అండగా నేనున్నాను. కంగారు పడాల్సిందేమీ లేదు)
స్టీఫెన్‌సన్: యస్ సార్.. రైట్ సార్ (మంచిది సర్)
చంద్రబాబు: ఫర్ ఎవ్రీ థింగ్ అయామ్ విత్ యూ.. వాట్ ఆల్ దే స్పోక్.. విల్ ఆనర్ (దేనికైనా మీకు నేను అండగా ఉంటా.. వాళ్లు మీతో మాట్లాడినవన్నీ నెరవేరుస్తాం)
స్టీఫెన్‌సన్: యస్ సార్.. రైట్ సార్
చంద్రబాబు: ఫ్రీలీ యూ కెన్ డిసైడ్.. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ (మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు. ఎలాంటి సమస్యా లేదు)
స్టీఫెన్‌సన్: ఓకే సార్ (మంచిది సర్)
చంద్రబాబు: దటీజ్ అవర్ కమిట్‌మెంట్.. వియ్ విల్ వర్క్ టు గెదర్ (అవి మా హామీ.. మనం కలిసి పనిచేద్దాం)
స్టీఫెన్‌సన్: రైట్.. థ్యాంక్యూ సార్
చంద్రబాబు: (థాంక్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement