35 వేలమంది ఉద్యోగులపై వేటు
35 వేలమంది ఉద్యోగులపై వేటు
Published Wed, Sep 7 2016 10:54 AM | Last Updated on Thu, Jul 11 2019 8:00 PM
బీజింగ్ : బ్యాంకుల ఆదాయం మందగించడం ఉద్యోగులకు ముప్పుగా మారింది. చైనాలోని అతిపెద్ద బ్యాంకుల ఆదాయ వృద్ధి తగ్గిపోవడంతో వ్యయాలను తగ్గించుకోవడానికి దాదాపు 35 వేలమంది ఉద్యోగులపై వేటు వేశాయి. ఈ ఏడాది ప్రథమార్థంలో బ్యాంకు లాభాలు ఫ్లాట్గా నమోదవడంతో పాటు మొండి బకాయిలు విపరీతంగా పెరిగిపోవడంతో బ్యాంకులు ఉద్యోగుల కోతతో వ్యయ భారాన్ని తగ్గించుకుంటున్నాయని ఫైనాన్సియల్ టైమ్స్ రిపోర్టు చేసింది. అంతేకాక రుణదాతలకు వడ్డీరేటు మార్జిన్లు కూడా పడిపోయాయని ఈ నివేదిక తెలిపింది. చైనాలో 19 లిస్టెడ్ బ్యాంకుల్లో, ఏడు బ్యాంకులు ముందటి ఆరు నెలల కాలంతో పోలిస్తే జూన్తో ముగిసిన ఈ ప్రథమార్థంలో తమ ఉద్యోగుల శాతాన్ని తగ్గించుకున్నట్టు రిపోర్టు చేశాయి.
ఆరు అతిపెద్ద బ్యాంకుల్లో ఐదు ఈ ఏడాది ప్రథమార్థంలో మొత్తం 34,691 ఉద్యోగులను తీసేసినట్టు బ్యాంకుల త్రైమాసిక ఫైనాన్సియల్ స్టేట్మెంట్లలో వెల్లడైనట్టు విండ్ ఇన్ఫర్మేషన్ తెలిపింది. అదేవిధంగా చైనా తరహాలోనే యూరోపియన్, అమెరికాలో 11 అతిపెద్ద బ్యాంకులు కూడా 100,000 ఉద్యోగులపై వేటు వేసినట్టు ఫైనాన్సియల్ టైమ్స్ విశ్లేషకులు వెల్లడించారు. ఫ్లాట్గా వస్తున్న ఆదాయాల నుంచి తప్పించుకోవడానికి లేదా సానుకూల ఆదాయాల వృద్ధి బాటలో నడవడానికి బ్యాంకులు ఆపరేటింగ్ వ్యయాలను నియంత్రిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
అదేవిధంగా డిజిటల్ బ్యాంకింగ్ వైపు వ్యవస్థలో ఎక్కువగా లావాదేవీలు జరుగుతుండటంతో కూడా బ్యాంకులు ఉద్యోగుల శాతాన్ని తగ్గించుకోవడానికి ఓ కారణంగా వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతం బ్యాంకుల్లో 90 శాతానికి పైగా లావాదేవీలు ఆన్లైన్లోనే జరుగుతున్నాయని, కమర్షియల్ బ్యాంకుల ఐటీ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ వ్యవస్థలను బ్యాంకులు ఎక్కువగా ఎంచుకుంటున్నాయని ఫైనాన్సియల్ టైమ్స్ రిపోర్టు చేసింది.
Advertisement