
మరో రికార్డు బద్దలుకు శ్రీకారం
బీజింగ్: చైనా మరో సాహసానికి దిగింది. ప్రపంచంలో అతిపెద్ద డ్యాం నిర్మాణం ప్రారంభించింది. దాదాపు 314 మీటర్ల (1,030 అడుగులు) ఎత్తు దీనిని నిర్మిస్తున్నది. చైనాలోని ప్రముఖ నది అయిన యాంగ్జీపై దీనిని నిర్మిస్తోంది. దీనికి శ్వాంజియాంకో డ్యాం అని నామకరణం చేసింది. 2022లోగా దీనిని పూర్తి చేయనున్నట్లు చైనా పర్యవరణశాఖ దాని వెబ్సైట్లో పెట్టింది. ఈ నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాంగా శ్వాంజియాంకో నిలవనుంది.
ప్రస్తుతం ప్రపంచంలోని ఎత్తైన జిన్ పింగ్-1 డ్యాం కూడా చైనాలోనే ఉండటం విశేషం. ఈ నిర్మాణంతో చైనా తన రికార్డు తానే బద్దలు కొట్టనుంది. భారీ స్థాయిలో విద్యుదుత్పాదన చేయాలనే ఉద్దేశంతోనే చైనా ఈ ఆనకట్టను నిర్మిస్తున్నట్లు స్పష్టం చేసింది. దేశానికి అవసరమవుతున్న విద్యుత్లో 20శాతం విద్యుత్ను ఈ ప్రాజెక్టునుంచే పొందాలనే లక్ష్యంతో డ్యాం నిర్మాణం చేపట్టామని ప్రకటించింది. వాతావరణంలో కర్భన సమ్మేళనాల స్థాయి దీనిద్వారా తగ్గిపోతుందని పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ డ్యాంలు చైనాలో ఉన్న విషయం తెలిసిందే.