ఇవిగో ఆధారాలు.. రాజే తప్పుకోవాలి | Congress mounts pressure on Rajasthan CM, BJP backs Raje | Sakshi
Sakshi News home page

ఇవిగో ఆధారాలు.. రాజే తప్పుకోవాలి

Published Thu, Jun 25 2015 3:15 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ఇవిగో ఆధారాలు.. రాజే తప్పుకోవాలి - Sakshi

ఇవిగో ఆధారాలు.. రాజే తప్పుకోవాలి

లలిత్‌మోదీ కేసులో కాంగ్రెస్ డిమాండ్
* వసుంధర రాజేకు సంబంధించిన పత్రాల విడుదల

న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్‌మోదీ విదేశాలకు వెళ్లిపోవడానికి రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సహకరించినట్లుగా స్పష్టమైన ఆధారాలున్నాయని, ఆమె వెంటనే రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాజే సంతకంతో కూడిన రహస్య పత్రాలను ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ బుధవారమిక్కడ విడుదల చేశారు. రాజేను తొలగించడం తప్ప ప్రధాని మోదీకి మరో ప్రత్యామ్నాయం లేదన్నారు.

2011 ఆగస్టు 18వ తేదీతో ఉన్న ఆ పత్రాల్లో.. ‘ఇమిగ్రేషన్ కోసం లలిత్ పెట్టుకున్న దరఖాస్తుకు మద్దతుగా ఈ స్టేట్‌మెంట్ ఇస్తున్నాను. అయితే నా ఈ సహాయాన్ని భారత అధికారులెవరికీ వెల్లడించవద్దనే స్పష్టమైన షరతు మీద మాత్రమే..’ అని ఉంది. దీనిపై రాజే స్పందించలేదు. కానీ ఆ పత్రాలపై రాజే సంతకం లేదని, అవి తప్పుడు పత్రాలని ఆమె సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా,   లలిత్ విషయంలో కేంద్ర మంత్రి సుష్మ, రాజేలను వెనకేసుకొచ్చినట్లుగా ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మరియాకు మద్దతు ఎందుకివ్వడం లేదని శివసేన కేంద్రాన్ని ప్రశ్నించింది.
 
చట్టం ప్రకారం వ్యవహరిస్తాం: జైట్లీ
లలిత్ కేసులో ప్రభుత్వం చట్టం ప్రకారమే వ్యవహరిస్తుందని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ పీటీఐతో అన్నారు. కాగా,  రాజే.. ఈ నెల 27 నుంచి చేయాల్సిన తన లండన్ పర్యటనను రద్దుచేసుకున్నారు.
 
ఈడీ విచారణ ముమ్మరం...

లలిత్ మోదీపై నమోదైన విదేశీ నిధుల ఉల్లంఘనకు సంబంధించిన కేసు విచారణను ఈడీ మరింత విస్తృతం చేసింది. మారిషస్‌కు చెందిన ఒక కంపెనీ నుంచి రూ. 21 కోట్ల నిధులను అక్రమంగా తరలించిన కేసులో మోదీకి చెందిన కంపెనీ పాత్రపై పూర్తి వివరాలను అందించాల్సిందిగా ఆదాయ పన్ను శాఖ, ఆర్‌బీఐ, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లకు ఈడీ లేఖలు రాసింది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాల కోసం మారిషస్ అధికారులను కూడా ఈడీ సంప్రదిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement