ఈ స్టార్ హీరోను గుర్తుపడతారా?
అతని తల్లి జ్యోతిష్కురాలు. నలుగురికి జాతకం చెబితేనే నోట్లోకి నాలుగు ముద్దలు. అమెరికా కాలిఫోర్నియాలోని అలామెడా కౌంటీలో నివసిస్తుండా.. పెళ్లి కాకుండానే ఆమె మగ కవలలకు జన్మనిచ్చింది. వారిలో ఒకడిపేరు మార్క్ సింక్లెయిర్. వయసుతోపాటే మార్క్ జీవితంలో సందిగ్థాలూ పెరిగాయి. నావి బ్రిటిష్, జర్మన్, స్కాటిష్ మూలాలని చెప్పే తల్లి.. తండ్రి పేరు మాత్రం చెప్పకపోయేది. మార్క్ ఇప్పటివరకు తనకు జన్మనిచ్చిన తండ్రిని కలుసుకోలేదు. న్యూయార్క్ లోని తన పిన్ని ఇంట్లో పెరిగిన మార్క్.. సందిగ్ధాల నుంచి బయడపడేందుకు సోషల్ యాక్టివిటీస్ లో యాక్టివ్ అయ్యాడు. స్కూల్లో నాటకాలు వేశాడు. కాలేజీలోనూ వాటిని కంటిన్యూ చేశాడు. స్టేజ్ ఆర్టిస్టుగా తన పేరును విన్ డీజిల్ గా మార్చుకున్నాడు.
నాటకాల ద్వారా కాస్తోకూస్తో పాపులర్ అయ్యాక సినిమాలవైపు నడిచాడు. కష్టానికి తోడు అదృష్టం కలిసొచ్చింది. విన్ డీజిల్ ఇప్పుడు హాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడు. వాన్ డమ్, ఆర్నాల్డ్ స్వార్జ్ నెగర్, బ్రూస్ విల్లీస్ ల శకం ముగుస్తున్న తరుణంలో హాలీవుడ్ తెరకు లభించిన అద్భుత యాక్షన్ హీరో అతను. ఇవ్వాళ (జులై 18- అమెరికన్ కాలమానం ప్రకారం) అతని బర్త్ డే. 49వ పడిలోకి అడుగుపెడుతోన్న ఈ హీరో ప్రస్తుతం ట్రిపుల్ ఎక్స్: ది రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8 సినిమాల్లో నటిస్తున్నాడు. 2017 జనవరిలో విడుదల కానున్న ట్రిపుల్ ఎక్స్ లో బాలీవుడ్ నటి దీపిక పడుకొనే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. బర్త్ డే సందర్భంగా విన్ డీజిల్ ను మనసారా పొగుడుతూ శుభాకాంక్షలు చెప్పింది దీపిక. జులై 20న ట్రిపుల్ ఎక్స్ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. (రెండ్రోజుల ముందే దీపికను చూస్తారా?)
ఇదిలా ఉంటే 1990లో హాలీవుడ్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి విన్ డీజిల్ హెయిర్ స్టైల్ లో మార్పు చోటుచేసుకోలేదు. గడిచిన 26 ఏళ్లుగా అతను బోడి గుండులోనే తప్ప జుట్టు పెంచుకోలేదు. విన్ డిజిల్ అనగానే గుండు, కండలు తిరిగిన శరీరం తప్ప మరో రూపాన్ని ఊహించుకోలేం. డీజిల్ అభిమానులు కొందరు తీవ్రంగా గాలించి హీరో హెయిర్ కట్ తో ఉన్న ఫొటోను సంపాదించారు. పై ఫొటో న్యూయార్క్ లోని ఆంగ్లో అమెరికన్ స్కూల్లో విన్ సీనియర్ క్లాస్ లో దిగినప్పటిది. చిన్ననాటి అనుభవాల వల్లనో ఏమోగానీ విన్ డీజిల్ కుటుంబానికి, మరీ ప్రధానంగా తన పిల్లలకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తాడు. క్షణం తీరిక దొరికినా వాళ్లతో ఆటలాడతాడు. అన్నట్లు ట్రిపుల్ ఎక్స్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాల్లో విన్ డీజిల్ హీరోనే కాదు వాటి నిర్మాతకూడా!