మాజీ సీఎంపై ఎఫ్ఐఆర్ నమోదు!
ఓటుకు కోట్లు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు, వ్యాపం కుంభకోణంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహార్, లలిత్ గేట్లో రాజస్థాన్ సీఎం వసుంధర రాజే.. ఇలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఎఫ్ఐఆర్లోకి ఎక్కుతున్న ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రుల జాబితా రోజురోజుకూ పెరిగిపోతున్నది. తాజాగా ఓ అవినీతి కుంభకోణానికి సంబంధించిన ఎఫ్ఐఆర్లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షత్ పేరు చేరింది. వివరాల్లోకి వెళితే..
2014కు ముందు షీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడు దఫాలు పనిచేశారు. ఆమె పదవిలో ఉన్న 15 ఏళ్లూ.. వేసవిలో ఢిల్లీ ప్రజలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేసేవారు. కాగా, ఈ సరఫరాకు సంబంధించిన కాంట్రాక్టులు, తదితర వ్యవహారాల్లో రూ. 400 కోట్ల అవినీతి జరిగినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. గత ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ.. వాటర్ ట్యాంకర్ కుంభకోణాన్ని ప్రచారాస్త్రంగా వాడుకుంది.
అధికారంలోకి వచ్చిన వెంటనే కుంభకోణంపై దర్యాప్తు జరిపించాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వం ఎల్జీ నవాజ్ జంగ్ను కోరింది. అనుమతి లభించడంతో దర్యాప్తు చేసిన పోలీసులు ఇటీవలే ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. అందులో మాజీ సీఎం షీలా దీక్షిత్ పేరు పలుమార్లు ప్రస్తావనకు రావడం గమనార్హం. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.