‘జేకేహెచ్ అబిద్’పై నేరం నిరూపణ!
♦ హిమాచల్‌ప్రదేశ్ కేసులో ఢిల్లీ ఎన్‌ఐఏ కోర్టు తీర్పు
♦ హైదరాబాద్‌లో అబు అన్స్ అనుచరుడిగా కార్యకలాపాలు
♦ ఇక జేకేహెచ్ కేసులో విచారణ ముందుకు...
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్త పేలుళ్లకు కుట్రపన్ని నగరంలో చిక్కిన ఐసిస్ అనుబంధ సంస్థ జునూద్æ అల్ ఖలీఫా ఫిల్ హింద్ (జేకేహెచ్) ఉగ్రవాద మాడ్యూల్‌కు చెందిన, గత ఏడాది డిసెంబర్‌లో అరెస్టయిన ఉగ్రవాది అబిద్ ఖాన్‌ను దోషిగా నిర్ణయిస్తూ ఢిల్లీలోని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం గురువారం తీర్పు చెప్పింది. ఖాన్‌ను హిమాచల్‌ప్రదేశ్‌లో అరెస్టు చేసిన సందర్భంలో కులులోని బంజార్ పోలీసులు నమోదు చేసిన కేసును ఎన్‌ఐఏ ఈ ఏడాది జనవరిలో రీ–రిజిస్టర్ చేసింది.
అబిద్ ఖాన్ గత ఏడాది హైదరాబాద్‌లో చిక్కిన అబు అన్స్‌కు అనుచరుడిగా ఉండటంతో పాటు ఆ మాడ్యూల్‌లో కలసి టోలిచౌకిలో జరిగిన కీలక సమావే శంలోనూ పాల్గొన్నాడు. గత ఏడాది జనవరిలో ఎన్‌ఐఏ అధికారులు దేశ వ్యాప్తంగా 14 మందితో పాటు నగరం లోనూ నలుగురిని అరెస్టు చేశారు. వీరిలో మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో నివసించిన అబు అన్స్, టోలిచౌకి వాసి మహ్మద్ షరీఫ్ మొయినుద్దీన్ ఖాన్ సైతం ఉన్నారు. బెంగళూరుకు చెందిన అబిద్‌ఖాన్ ఆన్‌లైన్ ద్వారా ఆకర్షితుడై జేకేహెచ్ మా డ్యూల్‌లో చేరాడు. ఈ మాడ్యూల్‌కు చీఫ్‌గా వ్యవ హరించిన ముదబ్బీర్, అబు అన్స్‌లతో సన్నిహితంగా మెలిగాడు.
సిటీలోనే రెండు ‘ఉగ్ర’సమావేశాలు...
ఈ మాడ్యూల్ బాంబుల తయారీతో పాటు ముష్కరులకు శిక్షణ ఇచ్చేందుకు నగరంలో రెండు సార్లు సమావేశమైనట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. టోలిచౌకిలోని నిజాం కాలనీలో ఉన్న మహ్మద్ షరీఫ్ మొయినుద్దీన్ ఖాన్ ఇంట్లో 2015 జనవరి 15న, డిసెంబర్ 14న ఈ ఉగ్రవాదులు సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో అబిద్ ఖాన్ పాల్గొ న్నాడని తేలింది. జేకేహెచ్ ఉగ్రవాదులు గెరిల్లా శిక్షణతో పాటు పేలుడు పదార్థాలు, తుపాకుల్ని ప్రయోగించడం కోసం వికారాబాద్‌లోని అనంతగిరి అడవులకు ఆనుకున్న కొన్ని ప్రదేశాల్లో అనువైన వాటిని, ఓ ఫామ్ హౌస్‌ను గుర్తించారు. ఈ పనిలో అబిద్ ఖాన్ సైతం పాల్గొన్నాడు.
అజ్ఞాతంలోకి వెళ్లిన అబిద్ ఖాన్..
జేకేహెచ్ మాడ్యూల్ అరెస్టు కావడంతో అబిద్ ఖాన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. శ్రీలంకతో పాటు అనేక ప్రాంతాల్లో సంచరించిన ఖాన్ గత ఏడాది జూలైలో హిమాచల్‌ప్రదేశ్‌లో కులు సమీపంలోని బంజార్‌కు చేరుకున్నాడు. అరెస్టును తప్పిం చుకోవడానికి మతాన్ని సైతం మార్చుకున్నాడు. తన పేరును పౌల్‌గా మార్చుకుని, ఓ చర్చ్‌లో పని చేస్తూ తలదా చుకున్నాడు. ఉగాండాలో ఉన్న తన స్నేహితురాలితో నిత్యం సంప్రదింపులు జరిపిన అబిద్.. ఆమెతో కలిసే ఇండోనేíసియా మీదుగా సిరియా వెళ్లి ఐసిస్‌లో పని చేయాలనుకున్నాడు.
దీంతో గత ఏడాది నవంబర్‌లో శ్రీలంక సైతం వెళ్లివచ్చాడని తేలింది. దీనిపై డిసెంబర్‌లో ఇతడిని అరెస్టు చేసిన బంజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇతడి నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లను ఎన్‌ఐఏ అధికారులు విశ్లేషించారు. వీటిలో లభించిన వివరాల ఆధారంగా బంజార్ కేసును రీ–రిజిస్టర్ చేశారు. ఈ కేసులోనే ఢిల్లీ న్యాయస్థానం అబిద్‌ను దోషిగా నిర్ధారించింది. శుక్రవారం ఇతడికి శిక్ష ఖరారు కానుంది. ఈ కేసు విచారణ ముగిసిన నేపథ్యంలో జేకేహెచ్ కేసులో విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.