విమానాన్ని 10మైళ్ల దూరంలో ల్యాండ్ చేశారు
వాషింగ్టన్: అమెరికాలో డెల్టా విమానం నిర్దేశిత విమానాశ్రయంలో కాకుండా పొరపాటుగా 10 మైళ్ల దూరంలో ఎయిర్ ఫోర్స్ బేస్లో ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
గురువారం సాయంత్రం డెల్టా ఫ్లయిట్ 2845 మినీయాపోలిస్ నుంచి సౌత్ డకోటాకు 130 మంది ప్రయాణికులతో బయల్దేరింది. షెడ్యూల్ ప్రకారం ఈ విమానం రాపిడ్ సిటీ రీజనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కావాలి. అయితే ఇందుకు బదులుగా ఎల్స్వర్త్ ఎయిర్ ఫోర్స్ బేస్లో దిగినట్టు డెల్టా ఎయిర్లైన్స్ అధికారులు చెప్పారు. ఎయిర్పోర్ట్కు, ఎయిర్ ఫోర్స్ బేస్కు 10 మైళ్ల దూరం ఉంటుంది. కాగా రెండు చోట్ల రన్ వే పాయింట్ దాదాపుగా ఒకే దిశలో ఉంటాయి.
కొన్ని గంటల తర్వాత అధికారులు సమన్వయం చేసుకుని డెల్టా విమానాన్ని రాపిడ్ సిటీ రీజనల్ ఎయిర్పోర్ట్కు తీసుకువచ్చారు. ఈ సంఘటనపై ఫెడరల్ అధికారులు విచారణ చేస్తున్నారు. విచారణకు పూర్తిగా సహకరిస్తామని, ఇప్పటికే సొంతంగా అంతర్గత సమీక్ష ప‍్రారంభించామని డెల్టా ఎయిర్లైన్స్ అధికారులు తెలిపారు. ప్రయాణికులకు అసౌకర్యం ఏర్పడినందుకు క్షమాపణలు చెప్పారు. కాగా గతంలో కూడా విమానాలను నిర్దేశిత విమానాశ్రయంలో కాకుండా పొరపాటున మరోచోట ల్యాండ్ చేసిన సంఘటనలు ఉన్నాయి.