
వావ్! ధోనీ మెరుపు తగ్గలేదు!
ప్రస్తుత ఐపీఎల్‌లో మహేంద్రసింగ్ ధోనీ బ్యాటింగ్‌లో అంతగా రాణించలేకపోవచ్చు, కానీ వికెట్ల వెనుక అతని జోరుకు అడ్డుకట్ట వేసేవారే లేరు. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- రైజింగ్ పుణె సూపర్ జెయింట్ మ్యాచ్‌లో మిస్టర్ కూల్ ఇదే నిరూపించాడు. అద్భుతమైన వికెట్ కీపింగ్ నైపుణ్యంతో రెప్పపాటులో బెంగళూరు బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్‌ను స్టంపౌట్ చేశాడు. ఈ స్టంపౌంట్‌ను చూసినవారికి ఒకప్పటి ధోని గుర్తుకురాక మానదు.
మ్యాచ్‌లో ఇమ్రాన్ తాహిర్ వేసిన రెండో బంతికి ఈ ఘటన జరిగింది. తాహిర్ బంతిని కాస్తా ముందుకు వచ్చి ఆడేందుకు డివిలియర్స్ ప్రయత్నించాడు. అయితే, బంతి మిస్ అయి నేరుగా ధోనీ చేతుల్లోకి వెళ్లింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా చురుగ్గా కదిలిన ధోనీ రెప్పపాటులో స్టంపౌట్ చేసి ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్ డివిలియర్స్‌ను పెవిలియన్ బాట పట్టించాడు. ఈ స్టంపౌట్‌ను చూసి థ్రిల్ అయిన ధోనీ అభిమానులు మిస్టర్ కూల్ టాలెంట్ ఏమాత్రం తగ్గలేదని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.