
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌కు భారత్‌లో ఉన్న ఫ్యాన్ ఫ్యాలోయింగ్ వేరే లెవల్‌లో ఉంటుంది. ఏబీడీ ఆటను ప్రాణపదంగా ప్రేమించే అభిమానులు ఇక్కడ చాలా మందే ఉన్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్లకు ఉన్నంతటి క్రేజ్ అతడికి కూడా ఉందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాడు. కెప్టెన్ కూల్ ధోని, టీమిండియా సారథి కోహ్లి, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మాదిరిగానే, ఏబీ డివిలియర్స్ మైదానంలో అడుగు పెడితే చాలు హర్షధ్వానాల మోతతో గ్రౌండ్ దద్దరిల్లిపోతుందంటూ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.
తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘2015.. ధర్మశాల.. సాధారణంగా ధోని, కోహ్లి, రోహిత్ వస్తుంటే ప్రేక్షకులు కేకలు వేస్తారు. సంతోషంతో అరుస్తారు. అచ్చం అలాగే ఏబీ డివిలియర్స్ రాగానే.. అంతా లేచి నిలబడ్డారు. తనని కూడా వారిలో ఒకడి(భారత ఆటగాడు)గానే భావించారు. నేను ఆ విషయం ఎప్పటికీ మర్చిపోను’’ అని పేర్కొన్నాడు.
కాగా.. దక్షిణాఫ్రికా ఇండియా టూర్‌లో భాగంగా, ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఏబీ డివిలియర్స్ రెండు సెంచరీలు బాదాడు. ముఖ్యంగా వాంఖడే స్టేడియంలో శతకం(119) సాధించగానే మైదానమంతా.. ‘‘ఏబీడీ.. ఏబీడీ’’అన్న నామస్మరణతో మారుమ్రోగిపోయింది. ఇక ఇటీవల తాను రిటైర్మెంట్‌పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఏబీ ప్రకటించడంతో.. భారత పౌరసత్వం తీసుకుని, టీమిండియాకు ఆడాలంటూ ట్విటర్ వేదికగా అతడికి ఇండియన్ ఫ్యాన్స్ అతడి పట్ల అభిమానం చాటుకున్న సంగతి తెలిసిందే. కాగా ఐపీఎల్ ద్వారా ఏబీ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
చదవండి: ఇండియాకు వచ్చెయ్ ప్లీజ్ .. పంత్ స్థానంలో ఆడు
నోరు మూసుకో అక్తర్.. కలలు కనటం మానేయ్: ఆసిఫ్
Comments
Please login to add a commentAdd a comment