
కేప్‌టౌన్: భారత మిడిలార్డర్‌కు చాలా ఏళ్లపాటు వెన్నెముకగా నిలిచిన ఆటగాడు ఎంఎస్ ధోని అనడంలో ఎటువంటి సందేహం లేదు. అటు కెప్టెన్‌గా, ఇటు బ్యాట్స్‌మన్‌గా జట్టుకు తిరుగులేని విజయాలు అందించాడు. విరాట్ కోహ్లికి అవకాశం ఇవ్వడం కోసం ఎంఎస్ ధోని తనకు తాను కెప్టెన్సీ పగ్గాలను వదిలేశాడు. కాగా, వయసు ప్రభావంతో మిస్టర్ కూల్ గతంలో మాదిరిగా భారీ షాట్లు ఆడలేకపోతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన ధోని 156 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో వచ్చే ప్రపంచ కప్‌లో ధోని స్థానంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. బ్యాటింగ్‌లో మహీ సత్తా చాటుతుండకపోవచ్చు కానీ మైదానంలో వ్యూహాలు రూపొందించడంలో మాత్రం ఇప్పటికీ అతడి తర్వాతే ఎవరైనా. ఇంకా వికెట్ల వెనుకాల అతడిలో చురుకుదనం మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. జట్టులో అతడు ఉన్నాడంటే టీమిండియాకు ఎంతో భరోసా.
అయితే ధోని క్రికెట్‌కు వీడ్కోలు పలికే తరుణం ఆసన్నమైందా అని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్‌ను అడగ్గా.. ఏబీ తనదైన శైలిలో బదులిచ్చాడు. ‘ధోనికి 80 ఏళ్లు వచ్చినా.. నా ఆల్ టైం డ్రీం ఎలెవన్‌లో స్థానం కల్పిస్తా. వీల్‌చైర్లో ఉన్న ధోని నా జట్టు తరఫున బరిలో దిగుతాడు. అతడు అద్భుతమైన ఆటగాడు, ఓసారి ధోని రికార్డులను చూడండి. అలాంటి ఆటగాణ్ని తప్పించాలని అనుకుంటారా? నేనైతే ఎప్పటికీ ఆ పని చేయను. ధోని మ్యాచ్ విన్నర్’ అని ఏబీ పేర్కొన్నాడు. అదే సమయంలో విరాట్ కోహ్లి కెప్టెన్సీపై కూడా ఏబీ ప్రశంసలు కురిపించాడు. తన కెప్టెన్సీతో టీమిండియాను నడిపించే తీరు చాలా బాగుందన్నాడు. ఐపీఎల్‌లో కోహ్లితో కలిసి ఆడటాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తానని ఏబీ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment