న్యూఢిల్లీ: పండుగ సీజన్‌ని పురస్కరించుకుని కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీలు భారీగా ఆఫర్లతో ఊదరగొడుతున్నాయి. డిస్కౌంట్లని, ఉచిత బహుమతులనీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కన్సూమర్ డ్యూరబుల్స్ తయారీ సంస్థలైతే కచ్చితమైన గిఫ్టులు, క్యాష్ బ్యాక్‌తో పాటు ఉచిత ఇన్‌స్టలేషన్, వార్షిక మెయింటెనెన్స్ వ్యయాల్లో డిస్కౌంట్లు, ఉచిత బీమా వంటి నోరూరించే ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.
ఉదాహరణకు దక్షిణ కొరియన్ సంస్థ ఎల్‌జీ.. ఖరీదైన టీవీలపై ఉచితంగా 3డీ బ్లూ రే హోమ్ థియేటర్‌ని అందిస్తామంటోంది. అలాగే కొన్ని నిర్దేశిత హై-ఎండ్ టీవీ మోడల్స్‌ని కొంటే 22, 24 అంగుళాల ఎల్‌ఈడీ టీవీలను ఉచితంగా ఇస్తామని చెబుతోంది. కొన్ని స్మార్ట్ టీవీ మోడల్స్‌పైనైతే మ్యాజిక్ మోషన్ రిమోట్‌ని కచ్చితమైన బహుమతిగా ఎల్‌జీ అందిస్తోంది. ఇక ఎస్‌బీఐ కార్డుతో కనుక డబ్బు చెల్లిస్తే కొనుగోలుదారుకు అయిదు శాతం దాకా క్యాష్ బ్యాక్ ఇస్తోంది. ఏడు గంటల్లోగా ఎల్‌ఈడీ ఇన్‌స్టాలేషన్, వార్షిక మెయింటెనెన్స్ వ్యయాల్లో 30 శాతం డిస్కౌంట్లు, ఆరు నెలల పాటు ఉచిత బీమా వంటి స్పెషల్ ఆఫర్స్‌ని కూడా ఎల్‌జీ ప్రకటించింది. అక్టోబర్ మొదటి వారంలో మొదలైన ఈ పండుగ ఆఫర్లు నవంబర్ 30 దాకా కొనసాగనున్నాయి. వీటి ద్వారా ఈ పండుగ సీజన్‌లో అమ్మకాలు 20 శాతం దాకా పెరగగలవని కంపెనీ అంచనా వేస్తోంది.
శాంసంగ్ దూకుడు..
కొరియాకి చెందిన మరో దిగ్గజం శాంసంగ్ సైతం దూసుకెడుతోంది. తమ అల్ట్రా హెచ్‌డీ టీవీలు, 65..75 అంగుళాల ఎల్‌ఈడీ టీవీలు, నిర్దిష్ట ఎయిర్‌కండీషనర్స్, రిఫ్రిజిరేటర్స్ కొనుగోళ్లపై గెలాక్సీ ట్యాబ్లెట్ పీసీలను శాంసంగ్ అందిస్తోంది. 28-40 అంగుళాల మధ్య ఉన్న ఎల్‌ఈడీల కొనుగోళ్లపై బ్లూ-రే డిస్క్ ప్లేయర్‌ని ఉచితంగా ఇస్తోంది. ఫ్రంట్‌లోడ్ వాషింగ్ మెషీన్లు, డిష్ వాషర్లతో స్టీమ్ ఐరన్ బాక్స్‌ని ఫ్రీగా అందిస్తోంది. అంతేకాదు.. ప్లాస్మా టీవీలు, ఎంపిక చేసిన కొన్ని ఎల్‌ఈడీ టీవీ మోడల్స్‌పైనా రూ. 1,000 దాకా క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇస్తోంది. ఎయిర్ కండీషనర్‌ని గెలుపొందే అవకాశం కల్పించేలా స్క్రాచ్ కార్డునూ ఇస్తోంది. ఈ సీజన్‌లో సుమారు రూ. 3,500 కోట్ల వ్యాపారంపై శాంసంగ్ దృష్టి పెట్టింది.
సోనీ లక్ష్యం రూ. 4,700 కోట్లు..: జపాన్ దిగ్గజం సోనీ.. పండుగ సీజన్‌లో రూ. 4,700 కోట్ల అమ్మకాల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. తమ ఎక్స్‌పీరియా ఫోన్లు, ట్యాబ్లెట్ల కొనుగోళ్లపై ఉచిత బ్లూ రే ప్లేయర్, అదనంగా బేస్ హెడ్‌ఫోన్, మెమరీ కార్డు వంటి ఆఫర్లు ఇస్తోంది. అల్ట్రా హెచ్‌డీ టీవీలతో పాటు బ్లూ-రే ప్లేయర్‌ని, 5 సినిమాల డిస్క్‌లను ఉచితంగా అందిస్తోంది. ఎల్‌ఈడీ టీవీ కొంటే కార్డ్‌లెస్ హెడ్‌ఫోన్‌ని సోనీ ఇస్తోంది.
పానసోనిక్ ఇండియా ఎక్స్ఛేంజ్ ఆఫర్లు..
పానసోనిక్ ఇండియా సంస్థ తమ ఉత్పత్తులపై అదనపు వారంటీ, ఈఎంఐ అవకాశాలు, ఎక్స్ఛేంజ్..కాంబో ఆఫర్లు, కచ్చితమైన గిఫ్టులు ఇస్తామంటూ ఊదరగొడుతోంది. లూమిక్స్ సిరీస్ కెమెరాలపై 4జీబీ ఎస్‌డీ కార్డు, క్యారీ కేస్, మూడేళ్ల అదనపు వారంటీ వంటివి ఉచితంగా ఇస్తోంది. పానసోనిక్ ఇండియా రూ. 1,200 కోట్ల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకుంది. వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, మైక్రో ఒవెన్లు వంటి గృహోపకరణాలపై స్టీమ్ ఐరన్ బాక్స్, డెసర్ట్ సెట్స్ వంటివి ఉచితంగా అందిస్తోంది. 29 అంగుళాల వియెరా ఎల్‌ఈడీ టీవీపై బెనెటన్ బ్యాగ్‌ని ఫ్రీగా ఇస్తోంది. మరోవైపు, కన్సూమర్ అప్లయన్సెస్ తయారీ సంస్థ గోద్రెజ్ సైతం కొన్ని ఎంపిక చేసిన వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లు, మైక్రో ఒవెన్లు, ఎయిర్ కండీషనర్ల వంటి వాటిపై స్టీమ్ ఐరన్లు, జ్యూసర్ మిక్సర్ గ్రైండర్లు మొదలైనవి ఉచితంగా అందిస్తోంది.
డీటీహెచ్ ఆపరేటర్లు..
డీటీహెచ్ ఆపరేటర్లు కూడా పండుగ సీజన్ బరిలో ముం దుంటున్నాయి. డిష్ టీవీ సంస్థ తమ హై డెఫినిషన్.. స్టాండర్డ్ డెఫినిషన్ సెట్ టాప్ బాక్సుల కొనుగోలుపై రూ. 1,500 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తోంది. దీంతో పాటు హై డెఫినిషన్ బాక్స్‌ని కొన్న వారు స్టాండర్డ్ డెఫినిషన్ బాక్స్‌ని ఉచితంగా దక్కించుకునేలా కాంబో ఆఫర్ కూడా ప్రకటించింది.
ఆఫర్ల పండుగ!
Published Wed, Oct 23 2013 1:20 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM
Advertisement
Advertisement